అడవివరం గ్రామకంఠాల సమస్యపై అఖిలపక్ష పోరు | - | Sakshi
Sakshi News home page

అడవివరం గ్రామకంఠాల సమస్యపై అఖిలపక్ష పోరు

Sep 21 2026 12:38 AM | Updated on Sep 21 2026 12:38 AM

● ఆ భూములపై సర్వహక్కులు కల్పించాలి ● పంచగ్రామాల భూసమస్యపై గ్రామసభ

సింహాచలం : అడవివరం గ్రామకంఠాల సమస్యపై పార్టీలకతీతంగా పోరాడాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. అడవివరం, పాతఅడవివరం, విజినిగిరిపాలెం గ్రామకంఠాల సమస్య పరిష్కారం కోసం ఆదివారం అడవివరంలోని రాజవీధిలో ఉన్న రామాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు.ఏళ్ల తరబడి గ్రామకంఠాల సమస్యతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నాయకులు ప్రస్తావించారు. గ్రామకంఠాల్లో ఉన్న ఇళ్లు, జిరాయితీ భూములు, ఖాళీ స్థలాలపై హక్కులు ఉన్నప్పటికీ ప్రభుత్వం హక్కుదారులుగా పరిగణించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామకంఠాల్లో నివసించే వారికి ప్రభుత్వం హక్కులు కల్పిస్తూ, భూములను 22ఏ నుంచి తొలగిస్తోందని, కానీ అడవివరం గ్రామకంఠాల భూముల విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.అడవివరంలోని సర్వేనంబరు 81ఏలోని 25 ఎకరాలు, విజినిగిరిపాలెంలోని సర్వేనంబరు 123లోని 1.66 ఎకరాలు, పాతఅడవివరంలోని 8.58 ఎకరాలను 22ఏ(1)(సి) నుంచి తొలగించి హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామకంఠం భూముల సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ విషయంపై భీమిలి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌ను కలుస్తామని తెలిపారు.పంచగ్రామాల భూ సమస్యతో గత ముప్పై ఏళ్లుగా ప్రజలు, నివాసితులు, రైతులు, ఖాళీ స్థలాల యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. వారిని ఆక్రమణదారులుగా చిత్రీకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమస్యలపై పోరాటానికి కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. సమావేశంలో భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రిసీతారాం, అడవివరం మాజీ సర్పంచ్‌ పాశర్ల ప్రసాద్‌, అడవివరం కోఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి, గ్రామస్తులు కొలుసు ఈశ్వరరావు, గుసిడి శంకరరావు, లంక సత్తిబాబు, కొణపల సత్యనారాయణ, రచ్చ ఆనందశ్రీనివాసవర్మ తదితరులు పాల్గొన్నారు.

రూ.లక్ష విరాళం

అడవివరం గ్రామకంఠం భూముల సమస్య, పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం కమిటీ చేసే పోరాటానికి తనవంతుగా లక్ష రూపాయల విరాళం అందిస్తానని కర్రి అప్పలస్వామి సభాముఖంగా ప్రకటించారు. సమస్య పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement