డాబాగార్డెన్స్ : జీవీఎంసీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియలో ప్రజల సౌలభ్యం, పరిపాలనా అవసరాలు, స్థానిక సంప్రదాయాలను పూర్తిగా పక్కనబెట్టి అడ్డగోలుగా మార్పులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు తీవ్రంగా ఆరోపించారు. మంగళవారం జీవీఎంసీ అదనపు కమిషనర్‌ను తన చాంబర్‌లో కలిసిన ఆయన, డీలిమిటేషన్‌పై పార్టీ సమన్వయకర్తలతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగరంలో వార్డుల సంఖ్యను 120కి పెంచే ప్రక్రియలో భాగస్వాములైన ప్రజల అభిప్రాయాలను విధిగా సేకరించాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో పెండింగ్‌లో ఉన్నప్పటికీ, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మ్యాపింగ్‌లో మార్పులు చేర్పులు చేయడం సరికాదని విమర్శించారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే మార్పులు
ప్రస్తుతం చేపడుతున్న డీలిమిటేషన్‌లో ప్రజా సౌకర్యం కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని కె.కె.రాజు ఆరోపించారు. కులాలు, రాజకీయ పార్టీల ప్రాతిపదికన వార్డులను విభజించడం వల్ల భవిష్యత్తులో స్థానికుల మధ్య విభేదాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఒకే గ్రామం లేదా ప్రాంత ప్రజలను వేర్వేరు వార్డుల్లోకి మార్చడం, ఆయా ప్రాంతాల దేవాలయాలు, గ్రామ సంఘాలను ఇతర వార్డుల్లో కలపడం అనుచితమన్నారు. దశాబ్దాలుగా నగరానికి ఉన్న సామాజిక అనుబంధాలను, సంప్రదాయాలను గౌరవించాలని కోరారు.
వార్డు సచివాలయ సేవలకు
విఘాతం కలగొద్దు
గతంలో ప్రజలకు సేవలు సులభంగా అందేలా వార్డు సచివాలయ వ్యవస్థను తీర్చిదిద్దారని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రతిపాదించిన మ్యాపింగ్ వల్ల సచివాలయాల పరిధులు మారి, నివాసితులకు తాగునీరు, డ్రైనేజీ, రహదారులు వంటి మౌలిక వసతుల సమస్యల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఎన్నికల నిబంధనలు, చట్టాలు, జీవోలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ సాగాలని స్పష్టం చేశారు.
మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి
డీలిమిటేషన్‌లో చేసిన మార్పులపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించి, తిరిగి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి నాయకుల రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా నగర ప్రజల ప్రయోజనాలకే అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రీవెన్స్ కార్యక్రమాలకు ప్రాముఖ్యతనిచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. వినతిపత్రం అందజేసిన వారిలో పార్టీ సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, మాజీ డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, నాయకులు బాణాల శ్రీనివాసరావు, పేడాడ రమణి కుమారి, సాడి పద్మారెడ్డి, రెయ్యి వెంకటరమణ, బిపిన్ కుమార్ జైన్, జీలకర్ర నాగేంద్ర, నీలి రవి, కె.రామిరెడ్డి, శ్రీదేవి వర్మ, చొల్లంగి నాగేశ్వరరావు, మువ్వల సంతోష్, సారిపిల్లి సంతోష్, సూర్య తదితరులు పాల్గొన్నారు.


