మహారాణిపేట: జిల్లాలో ఈనెల 11 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న ‘ఇంటింటి కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే’ పోస్టర్లు, బ్యానర్లను కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ కలెక్టరేట్‌లోని సమా వేశ మందిరంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ‘అంగవైకల్యాన్ని నివారించడానికి ముందుగానే కుష్ఠు వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తాం’ అనే లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సర్వేకు సహకరించాలని, శరీరంపై స్పర్శ తెలియని, అనుమానాస్పద మచ్చలు ఉంటే సర్వే బృందానికి తెలిపి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. జిల్లా కుష్ఠు వ్యాధి, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి డాక్టర్ ఆర్.రమేష్ మాట్లాడుతూ ఆశ కార్యకర్తలు, పురుష ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటినీ సందర్శించి కుటుంబ సభ్యులను పరీక్షిస్తారని తెలిపారు. అనుమానిత కేసులకు మరోసారి పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్థారణ అయితే బహుళ ఔషధ చికిత్స అందిస్తారని చెప్పారు. కార్యక్రమంలో పీఎంవో వెంకటరమణ డీఎన్‌ఎంవో డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.


