బీచ్‌రోడ్డులో సైకిల్ ట్రాక్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో టెండర్లు పిలిచిన తర్వాత ప్రైస్ బిడ్ తెరిచి, తక్కువ ధర కోట్ చేసిన సంస్థకు కాంట్రాక్టు అప్పగించడం ఆనవాయితీ. అయితే, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహారాలు సాగుతున్నాయి. ముందుగానే కాంట్రాక్టరును ఎంపిక చేసి, పనులు మొదలుపెట్టాక టెండర్ తెరిచి, సదరు కాంట్రాక్టర్‌కే పనులు దక్కినట్లు ప్రకటిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న సైకిల్ ట్రాక్ పనులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. సాధారణంగా టెండర్ గడువు 15 రోజులు, అత్యవసర పనులైతే వారం రోజులు ఉంటుంది. కానీ, ఈ సైకిల్ ట్రాక్ పనులకు మాత్రం కేవలం మూడు రోజుల గడువు మాత్రమే విధించారు. పోనీ టెండర్ ఖరారయ్యే వరకై నా ఆగారా అంటే అదీ లేదు. ‘ఎలాగైనా కాంట్రాక్టు నీకే వస్తుంది’ అని జీవీఎంసీ ఉన్నతాధికారి ఇచ్చిన హామీతో సదరు కాంట్రాక్టర్ గత శుక్రవారమే పనులు ప్రారంభించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు టెండర్ తెరిచి, అనుకున్నట్లే అతడే ఎంపికై నట్లు ప్రకటించారు. రాజమండ్రి నుంచి తనకు పరిచయం ఉన్న కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టేందుకే ఉన్నతాధికారి నిబంధనలు మార్చారని, వీరిద్దరి మధ్య ఉన్న ‘బంధం’ ఇప్పుడు జీవీఎంసీలో చర్చనీయాంశంగా మారింది.
ఎవరూ పోటీ పడకుండా పక్కా ప్లాన్
సాధారణ నిబంధనల ప్రకారం ప్రభుత్వ శాఖల్లో రూ.20 లక్షల లోపు అంచనా వ్యయం ఉన్న పనులకు అనుభవం లేకపోయినా, గుర్తింపు పొందిన ఏ కాంట్రాక్టు సంస్థ అయినా పాల్గొనవచ్చు. అయితే, ఆర్‌కే బీచ్ నుంచి సాగర్ నగర్ వరకు చేపడుతున్న రూ.కోటి విలువైన సైకిల్ ట్రాక్ వర్క్‌ను ఐదు భాగాలుగా విభజించి, ఒక్కో టెండర్ అంచనా వ్యయాన్ని రూ.16,79,533గా నిర్ణయించారు. మిగతా వారెవరూ పోటీ పడకుండా ఉండేందుకు దరఖాస్తుదారు గడిచిన ఏడాది కాలంలో 4,000 చదరపు మీటర్ల మేర ‘హాట్ అప్లైడ్ థర్మోప్లాస్టిక్ రోడ్ మార్కింగ్ కాంపౌండ్’ పని చేసి ఉండాలనే ప్రత్యేక అర్హతను జోడించారు. ఈ అనుభవం కేవలం సదరు రాజమండ్రి కాంట్రాక్టరుకు మాత్రమే ఉండటంతో, ఉన్నతాధికారి ఒత్తిడి తెచ్చి మరీ ఈ నిబంధనను చేర్పించినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారమే ఐదు భాగాల పనులనూ ఆ ఒక్క సంస్థకే కట్టబెట్టారు.
మూడు రోజుల్లోనే మమ అనిపించారు!
ఈ షార్ట్ టెండర్ ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు అంతా వేగంగా, ముందస్తు ప్రణాళికతో జరిగిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏ ప్రభుత్వ శాఖలోనైనా ‘షార్ట్ టెండర్’కు కనీసం వారం రోజుల గడువు ఇస్తారు. కానీ, ఈ పనులకు సెప్టెంబర్ 2న సాయంత్రం 5 గంటలకు ప్రారంభించి, సెప్టెంబర్ 5 సాయంత్రం 5 గంటలకే టెండర్ ముగించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే టెండర్లు పిలవడం, శనివారం సాయంత్రం హడావుడిగా ఓపెన్ చేసి వెంటనే ఫైనల్ చేయడం చూస్తుంటే.. ఈ తంతంతా సదరు ఉన్నతాధికారి కనుసన్నల్లోనే నడిచిందని స్పష్టమవుతోంది.


