చంద్రంపాలెం పాఠశాల అభివృద్ధి పనుల ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

చంద్రంపాలెం పాఠశాల అభివృద్ధి పనుల ప్రారంభం

Aug 23 2026 12:22 AM | Updated on Aug 23 2026 12:22 AM

● మాటల్లోనే కాదు.. రాతలోనూ తడబడిన మంత్రి లోకేష్‌ ● వినతులు వినకుండానే వెళ్లిపోయిన చినబాబు

మధురవాడ: చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో దివీస్‌ ల్యాబ్స్‌ సీఎస్‌ఆర్‌ నిధులతో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ శనివారం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, దివీస్‌ డైరెక్టర్‌ లలితా దివితో కలిసి పాఠశాలలో ఏర్పాటు చేసిన మూడు ఆర్‌వో ప్లాంట్లు, క్రీడా మైదానం, శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం క్రీడా మైదానాన్ని పరిశీలించి, కొద్దిసేపు విద్యార్థులతో కలిసి వాలీబాల్‌ ఆడారు.

విద్యాశాఖ మంత్రికే ఏడాదేదో గుర్తులేదా?

కామెంట్‌ బోర్డుపై మంత్రి లోకేష్‌ రాసిన రాతలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. బోర్డుపై తన అభిప్రాయాన్ని రాస్తూ తేదీ రాసే క్రమంలో సంవత్సరాన్ని 2026కి బదులుగా ‘06’ అని రాశారు. పక్కనే ఉన్న అధికారులు చెప్పడంతో వెంటనే దాన్ని సరిదిద్దారు. విద్యాశాఖ మంత్రికే కనీసం ప్రస్తుత సంవత్సరం కూడా గుర్తులేకుండా పోయిందా అంటూ అక్కడున్నవారు నవ్వుకున్నారు.

వినతులు ఇవ్వనీయకుండా నెట్టివేత

సీఎం కుమారుడు, రాష్ట్ర మంత్రి లోకేష్‌కు తమ సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చిన మధురవాడ ప్రాంతవాసులకు నిరాశ ఎదురైంది. వారి గోడు వినేందుకు మంత్రి ఏమాత్రం ఆసక్తి చూపించకపోగా.. వారిని లోకేష్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అడ్డుకుని కర్కశంగా నెట్టివేశారు. చంద్రంపాలెం పాఠశాలలోనే చదువుతున్న దివ్య అనే దివ్యాంగ బాలికకు 90 శాతం వైకల్యం ఉన్నా పింఛను మంజూరు కాలేదని తల్లిదండ్రులు బాలికతో కలిసి వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించినా సెక్యూరిటీ కనికరించకుండా వెనక్కి గెంటేశారు. దీంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, డీఈవో ప్రేమకుమార్‌, ప్రధానోపాధ్యాయుడు ఎం.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement