మహారాణిపేట: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 13 రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు శనివారం కళ్లకు నల్లగుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కేజీహెచ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆంధ్రా మెడికల్ కళాశాల మీదుగా తిరిగి కేజీహెచ్‌కు చేరుకుంది. అనంతరం జూనియర్ వైద్యులు మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రభుత్వం స్పందించాలి
రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న జూనియర్ వైద్యులు ఎక్కువ గంటలు పనిచేస్తున్నప్పటికీ తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని జూనియర్ వైద్యుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ వైద్యులకు అందుతున్న స్టైపెండ్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు, ఇతర రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం ఉందని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీజేడీఏ) నాయకులు డాక్టర్ శిరాజ్, దినకర్ సాయి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రిలే నిరాహార దీక్షలో డాక్టర్లు కల్యాణ్, చరణ్, సుభాష్, విజేత తదితరులు పాల్గొన్నారు.


