ఆక్సిజన్‌ ఎవరి నెత్తిన? | - | Sakshi
Sakshi News home page

ఆక్సిజన్‌ ఎవరి నెత్తిన?

Aug 19 2026 12:06 AM | Updated on Aug 19 2026 12:06 AM

అధికారం ఒకరిది.. బాధ్యత మరొకరిది.. సంతకం ఇంకొకరిది! రూ.1.40 కోట్ల లావాదేవీలపై అధికార వర్గాల్లో చర్చ నిర్వహణ బాధ్యతలు స్వీకరించేందుకు వైద్యుల వెనుకంజ భవిష్యత్‌ విచారణల్లో తమను బలిపశువులను చేస్తారేమోనని వైద్యుల ఆందోళన

కేజీహెచ్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్‌

మహారాణిపేట: ‘తల ఒకరిది.. తలపాగా మరొకరిది’ అన్న చందంగా కేజీహెచ్‌లో ఆక్సిజన్‌, ఫార్మసీ నిర్వహణ తయారైంది. రోగుల ప్రాణాలతో ముడిపడిన కీలక వ్యవహారాలపై ఎవరిది బాధ్యత.. ఎవరిది అధికారం.. ఫైళ్లపై సంతకం చేసేది ఎవరు? అన్నదానిపై స్పష్టత కొరవడింది. ఒకరి పరిధిలోని బాధ్యతలను మరొకరికి అప్పగిస్తూ, నిర్ణయాలు ఒకచోట.. సంతకాల బాధ్యత మరోచోట ఉండటంతో వైద్యులు, అధికారులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. భవిష్యత్‌లో ఏదైనా తప్పిదం జరిగితే తమను బాధ్యులను చేస్తారేమోనన్న భయం వారిలో నెలకొంది.

గతంలో సీఎస్‌ఆర్‌ఎంవో పరిధిలోనే..

గతంలో కేజీహెచ్‌లో ఆక్సిజన్‌, ఫార్మసీ తదితర కీలక వ్యవహారాలు సీఎస్‌ఆర్‌ఎంవో పరిధిలోనే సాగేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్పత్రి పరిపాలనలో అడ్మినిస్ట్రేటర్‌ పోస్టును కొత్తగా ఏర్పాటు చేసి డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారిని నియమించింది. దీంతో పరిపాలనకు సంబంధించిన పలు కీలక బాధ్యతలు కొత్త వ్యవస్థలోకి వెళ్లాయి. ఈ మార్పులతో సీఎస్‌ఆర్‌ఎంవో, డీసీఎస్‌ఆర్‌ఎంవోల అధికారాల పరిధిపైనా ప్రశ్నలు తలెత్తాయి. ప్రస్తుతం సూపరింటెండెంట్‌, అడ్మినిస్ట్రేటర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (పరిపాలన) కీలక నిర్ణయాల్లో ప్రధానంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

అధికారాలపై అంతర్గత పోరు

కేజీహెచ్‌లో బిల్లుల చెల్లింపులు, ఆర్డర్లు, మరమ్మతులు, కొనుగోళ్లు తదితర పరిపాలనా వ్యవహారాల్లో అధికారాలపై వివాదాలు కొనసాగుతున్నట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో కీలకంగా వ్యవహరించిన సీఎస్‌ఆర్‌ఎంవో, డీసీఎస్‌ఆర్‌ఎంవోల పాత్ర పరిమితమైందన్న అభిప్రాయం కొందరిలో ఉంది. అధికారాల బదలాయింపుపై పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతోపాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సందర్భాలున్నాయి. దీంతో కేజీహెచ్‌లో పరిపాలనా వ్యవహారాలు వర్గాలుగా విడిపోయిన పరిస్థితికి దారితీసినట్లు తెలుస్తోంది.

రూ.1.40 కోట్ల వ్యవహారంపై చర్చ

ఆక్సిజన్‌ నిర్వహణకు సంబంధించిన సుమారు రూ.1.40 కోట్ల లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లపై ఎవరు సంతకాలు చేశారు? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారుల సంతకాలు లేకుండానే ఇతరులు సంతకాలు చేసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై ఇప్పటికే సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడం, విచారణ చేయడం, కమిటీ నివేదిక సమర్పించడం జరిగింది. అయితే ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించకపోవడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. అధికారం ఒకరిది అయితే.. సంతకం మరొకరు చేయడంపై అధికార వర్గాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అధికారాలను అధికారికంగా బదలాయించారా? బదలాయిస్తే ఏ నిబంధనల ప్రకారం? అన్నది తేలాల్సి ఉంది.

ఫార్మసీ కొనుగోళ్లపైనా అభ్యంతరాలు

ఫార్మసీ విభాగంలో మందుల కొనుగోళ్లపై కూడా వివాదం నెలకొంది. బయట నుంచి మందులు కొనుగోలు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా కొనుగోళ్లు జరపడం వంటి అంశాలపై సంబంధిత విభాగాధిపతి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆయా ఫైళ్లపై సంతకాలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అభ్యంతరం ఉన్నప్పుడు సంతకం చేస్తే.. భవిష్యత్తులో ఆ కొనుగోళ్లపై ప్రశ్నలు తలెత్తినప్పుడు బాధ్యత ఎవరిదన్నది ప్రశ్నగా మారింది. దీంతో సంబంధిత అధికారులు సంతకాలకు వెనుకాడుతున్నట్లు సమాచారం.

అధికారాల కోసం కోర్టుకు..

తన పరిధిలో ఉండాల్సిన అధికారాలను ఇతరులకు అప్పగించి వ్యవహారాలు కొనసాగిస్తున్నారంటూ సీఎస్‌ఆర్‌ఎంవో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన అధికారాలను తనకే అప్పగించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించి పిల్‌ దాఖలు చేసినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పిటిషన్‌పై కోర్టులో జరిగిన విచారణ, వెలువడిన ఆదేశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

బాధ్యతలు తీసుకోవడానికి భయమెందుకు?

ఆక్సిజన్‌ నిర్వహణను ఇద్దరు వైద్యులకు అప్పగిస్తే.. వారు బాధ్యతలు స్వీకరించేందుకు ఇష్టపడడం లేదు. కమిటీలో కొనసాగలేమని లెటర్‌ కూడా ఇచ్చారు. కారణం.. గతంలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లపై తాము సంతకాలు చేయాల్సి వస్తుందేమోనన్న ఆందోళనేనని వైద్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. పైస్థాయి అధికారుల నిర్ణయాలతో జరిగే వ్యవహారాలకు తాము సంతకాలు చేస్తే.. భవిష్యత్తులో వాటిపై విచారణ జరిగితే తమను బలిపశువులను చేసే ప్రమాదం ఉందనే భయం వారిలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సీఎస్‌ఆర్‌ఎంవో, డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంవోలు సంతకాలు చేయని ఫైళ్లపై తమతో సంతకాలు చేయించేందుకు ఒత్తిడి వస్తుందేమోనన్న భయం వ్యక్తమవుతోంది. ‘బాధ్యతలు మావి.. నిర్ణయాలు మీవి’ అనే పరిస్థితిలో తాము ఎందుకు బాధ్యత వహించాలన్నది వారి వాదనగా తెలుస్తోంది.

తేలాల్సిన అసలు లెక్క ఇదే..

కేజీహెచ్‌లో ఆక్సిజన్‌ సరఫరా, ఫార్మసీ కొనుగోళ్లు అత్యంత కీలకమైనవి. వీటిలో చిన్నపాటి లోపం జరిగినా ప్రభావం నేరుగా రోగులపై పడే అవకాశం ఉంది. అలాంటి వ్యవహారాల్లో బాధ్యత ఎవరిది.. అధికారం ఎవరిది.. సంతకం ఎవరిది అన్నది స్పష్టంగా ఉండాలి. కానీ ప్రస్తుతం ఈ మూడు అంశాలపైనే గందరగోళం నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. ఆక్సిజన్‌, ఫార్మసీ వ్యవహారాల్లో ఇప్పటివరకు ఎవరు ఏ అధికారాలు వినియోగించారు? రూ.1.40 కోట్ల లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లపై ఎవరెవరు సంతకాలు చేశారు? ఆ అధికార బదలాయింపులకు సంబంధించిన ఉత్తర్వులు ఉన్నాయా? నిబంధనలకు విరుద్ధమైన కొనుగోళ్లపై వచ్చిన అభ్యంతరాలేమిటి? అన్న అంశాలపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. లేకపోతే.. బాధ్యతల గందరగోళం చివరకు ఆక్సిజన్‌ నిర్వహణనే ‘వైట్‌ ఎలిఫెంట్‌’గా మార్చే ప్రమాదం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement