అగనంపూడి (విశాఖ): ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దువ్వాడ పోలీస్‌స్టేషన్ పరిధి కూర్మన్నపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడేనికి చెందిన గద్దల వెంకటరత్నం (30) రెండేళ్ల క్రితం ఉపాధి కోసం విశాఖకు వచ్చాడు. ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ కూర్మన్నపాలెం మార్కెట్ రోడ్డులోని ఇంట్లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా మనస్తాపానికి గురైన వెంకటరత్నం సోమవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి సోదరుడు పాపారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


