బీచ్‌రోడ్డు: వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. స్వతంత్రోద్యమంలో దాని విశిష్టతను తెలియజేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులతో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీరేంద్ర సింగ్ సోలంకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేమాతర గీతం ఈ దేశ స్వతంత్రోద్యమానికి బలమైన పునాది వేసిందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి వందేమాతరం యొక్క పూర్తి భావాన్ని తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట గోపి మాట్లాడుతూ నేటి యువత వందేమాతర స్ఫూర్తితో దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ విశాఖ విభాగ్ కన్వీనర్ ఉమ్మిడి నితిన్, జిల్లా సంఘటన కార్యదర్శి చందు, జిల్లా కన్వీనర్ ప్రసాద్, నగర కార్యదర్శి ధనుష్‌లతో పాటు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


