ఎన్‌ఏడీ జంక్షన్: విశాఖ విమానాశ్రయాన్ని భోగాపురానికి తరలించి కార్మికుల పొట్ట కొట్టొద్దని జీవీఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ విమానాశ్రయాన్ని భోగాపురానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ విమానాశ్రయ సిబ్బంది, కార్మికులతో కలిసి విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారిపై మంగళవారం వారు నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇక్కడి విమానాశ్రయాన్ని మూసివేస్తే దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే విశాఖ విమానాశ్రయాన్ని మూసివేయడమేనా? అని ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు మధ్యతరగతి ప్రజల జీవనోపాధిని బలి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు కార్పొరేట్ సంస్థల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన విశాఖ విమానాశ్రయాన్ని కొందరి స్వార్థం కోసం మూసివేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. విశాఖ విమానాశ్రయాన్ని దేశీయ విమానాశ్రయంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎంపీ భరత్ గతంలో విశాఖ విమానాశ్రయం మూసివేయబోమని చెప్పి.. ఇప్పుడు ‘బైబై ఎయిర్‌పోర్టు’అనడం సరికాదని మండిపడ్డారు. ఎన్నికల ముందు పెద్దకొడుకుగా ఉంటానని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రజలను గాలికి వదిలేశారని విమర్శించారు. కార్మికులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్మికులు ‘వైజాగ్ ఎయిర్‌పోర్టును కాపాడండి.. చంద్రబాబు హామీ నిలబెట్టుకోండి.. కార్మికులకు న్యాయం చేయండి’అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.


