నాస్‌కామ్‌ స్టార్టప్‌.. ఏయూ ఫుల్‌స్టాప్‌ | - | Sakshi
Sakshi News home page

నాస్‌కామ్‌ స్టార్టప్‌.. ఏయూ ఫుల్‌స్టాప్‌

Aug 19 2026 12:06 AM | Updated on Aug 19 2026 12:06 AM

ఏయూ నాస్‌కామ్‌ స్టార్టప్‌ కేంద్రం

మూసివేత చర్యలు

రూ.27 కోట్లతో ఏర్పాటు..

40 స్టార్టప్‌లకు ఊతం

మూసివేతతో రూ.50 కోట్లకు పైగా

వర్సిటీకి నష్టం

అభివృద్ధి చేయకుండా..

మూసేయడంపై సందేహాలు?

విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్టార్టప్‌లు, సాంకేతిక ఆవిష్కరణలకు ఊతమిచ్చే నాస్‌కామ్‌ స్టార్టప్‌ కేంద్రానికి ‘దుకాణం సర్దే’ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. కేంద్రాన్ని ఖాళీ చేయించేందుకు ఏయూ యాజమాన్యం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మంచి ఫలితాలు సాధిస్తున్న కేంద్రాన్ని కొనసాగించి.. మరింత బలోపేతం చేయాల్సింది పోయి మూసివేత దిశగా అడుగులు వేయడంపై పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, మేధావి వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఏయూ అభివృద్ధికి పలు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఏయూ, నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌(నాస్‌కామ్‌), కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(మెయిటీ) సహకారంతో 2020లో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. రూ.27 కోట్ల పెట్టుబడితో ఏయూ ప్రాంగణంలో స్టార్టప్‌లు, సాంకేతిక ఆవిష్కరణలు, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. అప్పటి రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి రాజీవ్‌ త్రివేది కేంద్రాన్ని ప్రారంభించారు.

నాలుగేళ్లలో 40 స్టార్టప్‌లకు ఊతం

ఏర్పాటైన నాటి నుంచి కేంద్రం వివిధ రంగాలకు చెందిన సుమారు 40 స్టార్టప్‌లను ఇంక్యుబేట్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. యువ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం, మౌలిక సదుపాయాలు, సాంకేతిక సహకారం, ఇతర అవసరమైన సేవలు అందిస్తూ కేంద్రం గుర్తింపు పొందింది. ఇలాంటి వ్యవస్థ ఒకసారి ఏర్పడి పనిచేయడం మొదలైన తర్వాత దాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఏయూలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొనడం చర్చనీయాంశంగా మారింది.

అభివృద్ధి చేయకుండా మూసివేతా?

ప్రస్తుతం ఈ కేంద్రం మూసివేతకు ఏయూ వైస్‌చాన్స్‌లర్‌ నిర్ణయించినట్లు సమాచారం. కేంద్రం నిర్వహిస్తున్న ప్రదేశాన్ని ఖాళీ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌ సంస్థలకు సైతం నోటీసులు జారీ చేసి ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని సూచించినట్లు బోగట్టా. దేశవ్యాప్తంగా విద్యా, పరిశోధనా సంస్థలు స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌, ఇంక్యుబేషన్‌ కేంద్రాల ఏర్పాటుకు భారీగా పెట్టుబడులు సమీకరించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో.. ఈ కేంద్రాన్ని మూసివేయాలనే ఆలోచనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎంత వరకు సమంజసం!

ఏయూలో ఒక మంచి ప్రాజెక్టు ఏర్పాటైతే దాన్ని మరింత అభివృద్ధి చేయాల్సింది పోయి పూర్తిగా మూసివేయాలనే నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసం? అంటూ ఏయూ వర్గాల్లోనే విమర్శలు వినిపిస్తున్నాయి. జాతీయ విద్యా విధానం–2020 పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమ–విద్యాసంస్థల భాగస్వామ్యం, స్టార్టప్‌ సంస్కృతి, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పనిచేస్తున్న ఇంక్యుబేషన్‌ కేంద్రాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

స్టార్టప్‌లకు ‘స్టార్ట్‌’ చెప్పాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం.. ఉన్న స్టార్టప్‌ కేంద్రానికే ‘స్టాప్‌’ చెప్పేందుకు సిద్ధమవుతోంది. రూ.27 కోట్ల పెట్టుబడితో ఏర్పాటై, సుమారు 40 స్టార్టప్‌లకు అండగా నిలిచిన నాస్‌కామ్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రాన్ని అభివృద్ధి చేయాల్సిన ఏయూ యాజమాన్యం.. ఏకంగా ‘దుకాణం సర్దేయండి’ అంటూ సంకేతాలివ్వడం చర్చనీయాంశంగా మారింది. దేశమంతా స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌ అంటూ పరుగులు పెడుతుంటే.. ఏయూలో మాత్రం ఇప్పటికే నడుస్తున్న కేంద్రానికే ‘ఎగ్జిట్‌’ చెబుతూ. తిరోగమన చర్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement