తాటిచెట్లపాలెం: విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలతో పాటు రైల్వే ఆస్తులను కాపాడడంలో కీలక పాత్ర పోషించిన పలువురు రైల్వే ఉద్యోగులను దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ భద్రతా అవార్డులతో సత్కరించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడిన అనంతరం తొలిసారిగా ఈ భద్రతా అవార్డులను ప్రదానం చేశారు.అవార్డు గ్రహీతల్లో విజయవాడ డివిజన్ చీరాల స్టేషన్ సూపరింటెండెంట్ ఎం. రమేష్‌బాబు, గుంతకల్ డివిజన్ ఏర్పేడు పరిధి పాయింట్స్‌మన్ శివం దీక్షిత్, గుంతకల్ డివిజన్ సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ ఎం. ప్రవీణ్‌కుమార్, విశాఖ డివిజన్ ట్రైన్ మేనేజర్ సీహెచ్. రామమోహనరావు ఉన్నారు. వీరు విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించి, సమయస్ఫూర్తితో పెను ప్రమాదాలను నివారించారని, వారి సేవలను గుర్తించి ఈ అవార్డులు అందజేస్తున్నట్లు జీఎం తెలిపారు. అనంతరం నాలుగు డివిజన్లకు చెందిన శాఖాధిపతులు, డివిజనల్ రైల్వే మేనేజర్లతో కలిసి భద్రతా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.


