కేజీహెచ్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న చారిత్రాత్మక గడియారపు స్తంభంపై ఎగురుతున్న జాతీయ జెండా తీవ్ర దయనీయ స్థితిలో దర్శనమిస్తోంది. దేశానికి గర్వకారణమైన మువ్వన్నెల జెండా చిరిగిపోయి, చిన్నభిన్నమైనప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిరోజూ ఆసుపత్రి ఉన్నతాధికారులు, సిబ్బంది ఇదే మార్గంలో వెళ్తున్నప్పటికీ జాతీయ పతాక స్థితిని గమనించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. జాతీయ జెండా నిబంధనల ప్రకారం.. దెబ్బతిన్న లేదా చిరిగిన పతాకాన్ని తక్షణమే తొలగించి, దానికి తగిన మర్యాదలతో గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలి. అయితే కేజీహెచ్ పాలకవర్గం ఈ నిబంధనలను విస్మరించి దేశ గౌరవానికి భంగం కలిగిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఆసుపత్రి అధికారులు తక్షణమే స్పందించి, ఆ స్థానంలో నూతన త్రివర్ణ పతాకాన్ని సగౌరవంగా ఆవిష్కరించాలని నగరవాసులు, రోగుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
–ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


