విరుద్ధ ప్రకటనలతో అవస్థలు | - | Sakshi
Sakshi News home page

విరుద్ధ ప్రకటనలతో అవస్థలు

Jul 28 2026 2:12 AM | Updated on Jul 28 2026 2:12 AM

● అధికారుల సమన్వయ లోపం ● పీజీఆర్‌ఎస్‌లో వినతులు అందజేసేందుకు వచ్చిన బాధితులు

మహరాణిపేట: జిల్లా పాలనాధికారుల మధ్య సమన్వయ లోపం, పరస్పర విరుద్ధ ప్రకటనలు సాధారణ ప్రజలకు తీవ్ర నిరాశను, వేదనను మిగిల్చాయి. సమస్యల పరిష్కారం కోసం ఎంతో వ్యయప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన వందలాది మంది అర్జీదారులు తీరని నిరాశతో వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దయిందనే విషయం తెలియక వచ్చిన బాధితులు, అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి గిరిప్రదక్షిణ ఉత్సవాలు ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల యంత్రాంగం ఉత్సవ ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. ఈ కారణంతో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే అదే సమయంలో సోమవారం యథావిధిగా ఫిర్యాదుల స్వీకరణ జరుగుతుందని మరో ప్రకటన కూడా వెలువడటంతో ప్రజలు తీవ్ర అయోమయానికి గురయ్యారు. అధికారుల ప్రకటనల సమాచారం తెలియక, తమ సమస్యలు తీరుతాయనే ఆశతో వందలాది మంది ప్రజలు ఉదయమే అర్జీలతో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో సోమవారం ఉదయం నుంచే కరుణాస్పద దృశ్యాలు కనిపించాయి. తీవ్రమైన ఎండలో చంటిపిల్లలను ఎత్తుకుని వచ్చిన తల్లులు, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధ దంపతులు, వివిధ సమస్యలతో వచ్చిన అనేక మంది ఉదయం పదిన్నర గంటలకే కలెక్టరేట్‌ భవనాల మెట్లపై, గట్లపై కూర్చుని అధికారుల కోసం ఎదురుచూశారు. ఆర్జీలను చేతిలో పట్టుకుని ఆశగా ఎదురుచూస్తున్న వారికి, అక్కడి సిబ్బంది ఈ వారం కార్యక్రమం రద్దయిందని చెప్పడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎంతో దూరాల నుంచి ఎన్నో ఆశలతో వచ్చిన తమకు అధికారుల సమాచార లోపం వల్ల అన్యాయం జరిగిందని బాధితులు వాపోయారు. ఇప్పటికై నా అధికారులు ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలకు ముందే స్పష్టమైన సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement