రూ. 1.08 కోట్ల విలువైన చోరీ సొత్తు స్వాధీనం
జూన్ రిపోర్ట్ వెల్లడించిన సీపీ శంఖబ్రత బాగ్చి
చోరీ సొత్తు బాధితులకు అందజేత
అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల అదుపునకు, చోరీకి గురైన సొత్తు స్వాధీనానికి చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. గత జూన్ నెలలో నమోదైన వివిధ రకాల ఆస్తి నేరాలకు సంబంధించి మొత్తం 71 కేసులను ఛేదించి, 84 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. ఈ కేసుల్లో నిందితుల నుంచి రూ. 39,77,431 విలువైన ఆస్తితో పాటు, రూ. 68.25 లక్షల విలువైన 455 మిస్సింగ్ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, మొత్తం కలిపి రూ. 1,08,02,431 విలువైన ఆస్తిని రికవరీ చేసినట్లు తెలిపారు. సోమవారం నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. అనంతరం స్వాధీనం చేసుకున్న నగలు, వాహనాలు, చరవాణులను బాధితులకు ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రికవరీ చేసిన సొత్తులో 534.455 గ్రాముల బంగారం, 699.8 గ్రాముల వెండి, రూ. 1,16,281 నగదు, 27 మోటార్‌సైకిళ్లు, 5 ఆటోలు, 470 ఫోన్లు, ల్యాప్‌టాప్, 3 సైకిళ్లు, 5 వంటగ్యాస్ సిలిండర్లు, 90 అల్యూమినియం కాలమ్ బాక్స్‌లున్నాయని వివరించారు. ఛేదించిన 71 కేసులలో 4 దోపిడీ కేసులు, 2 పగటిపూట చోరీలు, 6 రాత్రిపూట చోరీలు, 4 స్నాచింగ్ కేసులు, 23 ద్విచక్ర వాహనాల చోరీలు, 5 ఆటో చోరీలు, 3 సైకిల్ చోరీలు, 24 సాధారణ చోరీ కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నగరంలో నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా జూన్ నెలలోనే 203 నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు 204 నేర అవగాహన సమావేశాలు నిర్వహించామని సీపీ తెలిపారు. నేర ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక పహారా, డ్రోన్ బీట్లు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. పోన్లు రికవరీకి సీఈఐఆర్ పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతోందని, జూన్ నెలలో 455 ఫోన్లు స్వాధీనం చేసుకోగా, ఇప్పటివరకు మొత్తం రూ. 16.99 కోట్ల విలువైన 11,130 సెల్‌ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామని వెల్లడించారు. అత్యధిక కేసులను ఛేదించడంలో పీఎం పాలెం, ద్వారకా, అరిలోవ పోలీస్ స్టేషన్లు ముందంజలో నిలిచాయని పేర్కొంటూ ఆయా పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు.


