ఈవీ వాహనంలో షార్ట్‌ సర్క్యూట్‌ | - | Sakshi
Sakshi News home page

ఈవీ వాహనంలో షార్ట్‌ సర్క్యూట్‌

Jul 28 2026 2:12 AM | Updated on Jul 28 2026 2:12 AM

● అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన అగ్నికీలలు ● పలు వాహనాలు దగ్ధం

ఎంవీపీకాలనీ: ఎంవీపీ కాలనీ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్‌–3లోని శ్రీనిలయం అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో ఉన్న ఒక విద్యుత్‌ ద్విచక్ర వాహనంలో మొదలైన మంటలు పక్కనే ఉన్న ఇతర వాహనాలకు వ్యాపించడంతో భారీ నష్టం వాటిల్లింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీనిలయం అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో రెండు విద్యుత్‌ ద్విచక్ర వాహనాలతో పాటు పలు ఇతర వాహనాలను నిలిపి ఉంచారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో విద్యుత్‌ వాహనంలో ఒక్కసారిగా షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అపార్ట్‌మెంట్‌ నివాసులంతా గాఢనిద్రలో ఉండటంతో ప్రమాదాన్ని త్వరగా గుర్తించలేకపోయారు. దీంతో అగ్నికీలలు పక్కనే ఉన్న ఒక కారుతో పాటు మరికొన్ని వాహనాలకు వేగంగా వ్యాపించాయి. అదే సమయంలో మొదటి అంతస్తులో నివాసముంటున్న ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ కుమారుడు పొగ, కాలిన వాసనను గుర్తించి వెంటనే అపార్ట్‌మెంట్‌ వాసులను అప్రమత్తం చేశాడు. అప్పటికే సెల్లార్‌ అంతటా దట్టమైన పొగ, అగ్నికీలలు అలుముకున్నాయి. వెంటనే 112 ద్వారా సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది..రాత్రివేళ గస్తీ తిరిగే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే అగ్నిప్రమాదంలో ఒక కారు, ఐదు ద్విచక్ర వాహనాలు, రెండు విండో ఏసీలు, రెండు సైకిళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. సమయానికి అప్రమత్తమవ్వడంతో నివాసితులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, పెద్ద ప్రమాదం తప్పిందని ఎంవీపీ ఎస్‌ఐ సీతారాం తెలిపారు. అపార్ట్‌మెంట్‌ నివాసి వి. నాగేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement