పబ్లిసిటీ పీక్‌.. క్వాలిటీ వీక్‌ | - | Sakshi
Sakshi News home page

పబ్లిసిటీ పీక్‌.. క్వాలిటీ వీక్‌

Jul 13 2026 12:46 AM | Updated on Jul 13 2026 12:46 AM

ఆరిలోవ: ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ప్రచారాలతోనే సరిపెడుతోంది. ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర’కిట్ల పంపిణీ జిల్లాలో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒకపక్క విద్యాశాఖ అధికారులు, కూటమి నేతలు తాము విద్యార్థులందరికీ కిట్లు పంపిణీ చేసేశామంటూ లెక్చర్లు ఇస్తుంటే.. క్షేత్రస్థాయిలో కథ వేరేలా ఉంది. ‘కూటమి మార్కు’కిట్లలో నాణ్యత మచ్చుకై నా కనిపించకపోవడం, అరకొర పంపిణీతో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.

వారం రోజుల ముచ్చటే!

జిల్లాలో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, గురుకులాలు, ఎయిడెడ్‌ తదితర మొత్తం 594 పాఠశాలలున్నాయి. వీటిలో 2026–27 విద్యా సంవత్సరంలో సుమారు 65,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. జూన్‌లో బడులు తెరిచినప్పుడు కేవలం పుస్తకాలు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. బ్యాగులు, బూట్లు ఎప్పుడు ఇస్తారో తెలియక దాదాపు నెల రోజులు విద్యార్థులు పాత బ్యాగులతోనో, కొత్తవి కొనుక్కునో బడి బాట పట్టారు. వారం క్రితం చంద్రబాబు ప్రభుత్వం బ్యాగులు, బూట్లు సరఫరా చేసింది. అయితే, కొత్త బ్యాగులు వచ్చాయన్న పిల్లల ఆనందం వారం కూడా నిలవలేదు.

కొలతలు తీసినా.. సరిపోలేదు!

ఇక బూట్ల కథ మరీ విచిత్రం. కిట్ల పంపిణీకి ముందే పాఠశాలల వారీగా ఉపాధ్యాయుల ద్వారా ప్రతి విద్యార్థి పాదాల కొలతలు తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తీరా పంపిణీ చేసిన బూట్లు అత్యధిక మందికి సరిపోకపోవడం గమనార్హం. సుమారు 60 శాతం మంది విద్యార్థులకు అయితే మరీ పెద్దవి, లేకుంటే అసలు పాదం కూడా దూరనంత చిన్న బూట్లు వచ్చాయి. దీంతో ఈ బూట్లు వేసుకోలేక, అవి బడుల్లోని స్టోర్‌ రూములకే పరిమితమయ్యాయి. పిల్లలు ఎప్పటిలాగే చెప్పులతో, ఉత్త కాళ్లతోనే క్లాసులకు హాజరవుతున్నారు.

పుస్తకాల బరువుకు ‘బెల్టులు’ కట్‌

తరగతుల వారీగా పుస్తకాల బరువును అంచనా వేసి నాణ్యమైన బ్యాగులు తయారు చేయించాల్సిన ప్రభుత్వం.. అత్యంత నాసిరకం బ్యాగులను సరఫరా చేసింది. పిల్లలు పుస్తకాలు సర్దుకుని బడికి వెళ్లిన రెండో రోజే చాలామంది బ్యాగుల కుట్లు ఊడిపోయాయి. మరికొన్ని జిప్పులు ఊడడమే కాకుండా, రింగులు విరిగి, బెల్టులు తెగిపోయాయి. దీంతో విసిగిపోయిన విద్యార్థులు ఆ నాసిరకం బ్యాగులను ఇంట్లోనే పడేసి.. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన పాత బ్యాగులను లేదా బయట కొన్నవాటిని వాడుతున్నారు. గత ఏడాది కూడా ఇంతే నాసిరకమైన కిట్లు అందించి.. అభాసుపాలైనా.. ప్రభుత్వంలో మార్పు రాలేదని తల్లిదండ్రులు ఆక్షేపిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ

ప్రభుత్వంలోనే భేష్‌!

ఇప్పటికీ చాలా మంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన బ్యాగులనే వాడుతున్నారు. తల్లిదండ్రులు కూడా అప్పటి ‘జగనన్న విద్యా కానుక’కిట్లను, ఇప్పటి విద్యార్థి మిత్ర కిట్లతో సరిపోల్చుతున్నారు. అప్పట్లో చాలా నాణ్యమైన సామగ్రితో కూడిన కిట్లను పాఠశాల తెరిచిన తొలి రోజే అందించేవారని గుర్తు చేసుకుంటున్నారు. అప్పటి తీరును దృష్టిలో ఉంచుకునైనా.. కూటమి ప్రభుత్వ పెద్దలు, అధికారులు మారకపోతే.. ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.

విద్యార్థులకు స్టూడెంట్‌ కిట్ల పంపిణీపై కూటమి నేతలు చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కానీ ఆ కిట్‌ విద్యార్థుల చేతికి చేరేసరికి అసలు రంగు బయటపడింది. ఆలస్యంగా పంపిణీ చేసిన బ్యాగులు.. చేతికి వచ్చిన రెండు రోజుల్లోనే చిరిగిపోతే, కొలతలు తీసుకుని మరీ.. ఇచ్చిన బూట్లు కాళ్లకు సరిపోలేదు. కొత్తగా చేరిన విద్యార్థులకు చాలా వరకు పాఠ్యపుస్తకాలు అందక.. పక్కనున్న పిల్లల పుస్తకాల్లోకి తొంగిచూడాల్సిన పరిస్థితి. ప్రచారంలో ‘విద్యార్థి మిత్ర’ గొప్పలు... వాస్తవంలో మాత్రం విద్యార్థులకు తప్పని తిప్పలు.. ఇదీ కూటమి ప్రభుత్వానికి పేదింటి పిల్లల చదువులపై ఉన్న శ్రద్ధ!

‘విద్యార్థి మిత్ర’ కిట్లతో

విద్యార్థులకు తిప్పలు

వారం తిరక్కముందే

చిరిగిన బ్యాగులు

పాదాల కొలతలు కరెక్ట్‌..

బూట్ల సైజులే రాంగ్‌

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోని

బ్యాగులకే ఇంకా మొగ్గు!

జిల్లాలో 594 స్కూళ్లు..

65,500 మంది విద్యార్థులు

కిట్‌ అంటే ముక్కలు ముక్కలుగా పంపిణీయా..!

‘కిట్‌ అంటే పుస్తకాలు, బూట్లు, బ్యాగు అన్నీ ఒకేసారి సెట్‌లా ఇవ్వాలి. ఒక్కో వస్తువు నెలకోసారి ఇస్తే దాన్ని కిట్‌ ఎలా అంటారు?’అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. బ్యాగులు ఎప్పుడు ఇస్తారో ముందే చెప్పకపోవడంతో తాము అప్పులు చేసి బయట మార్కెట్‌లో కొనుక్కోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. ఇప్పుడు ఇచ్చినవి కూడా వారం తిరక్కముందే చిరిగిపోవడంతో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ప్రచారార్భాటాలు తప్ప, బడుల్లో పిల్లల ‘ఏకరూపత’(యూనిఫామిటీ) ఎక్కడా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement