స్పీకర్ అయ్యన్నపాత్రుడు
కొమ్మాది: ఓటు వేయని వాడికి సంక్షేమ పథకాలు, పెన్షన్‌లు ఇవ్వడం అవసరమా? అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రుషికొండలో ఆదివారం జరిగిన ‘వెంకయ్య నాయకుడు’ పుస్తకావిష్కరణ సభలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఓటరు లిస్టులో పేరు లేకపోతే ఆ ఓటరు చచ్చిపోయినట్లేనని, పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటు వేయనివాడికి పథకాలు ఎందుకు ఇవ్వాలి? అని అన్నారు. ఓటరు లిస్టులో పేరు ఉందో లేదో తెలియని వాడికి పథకాలు ఇవ్వాలా? అంటూ ఊగిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఇంటింటికీ అధికారిని పంపించి ఓటు నమోదు చేసుకోవడం ఏమిటని, మీరు ఓటు నమోదు చేసుకోలేరా? బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ఈయన చేసిన వ్యాఖ్యలకు సభకు వచ్చిన వారందరూ ఒక వైపు ఆశ్చర్యం, మరోవైపు అసహనం వ్యక్తం చేశారు.
18న జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపిక
విశాఖ స్పోర్ట్స్: జిల్లా సబ్ జూనియర్, జూనియర్స్ అథ్లెటిక్స్ జట్ల ఎంపిక ఈ నెల 18న జరగనుంది. జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో రైల్వే స్టేడియం అథ్లెటిక్స్ గ్రౌండ్‌లో ఈ ఎంపికలు నిర్వహించనున్నారు. అండర్ 14లో పాల్గొనే బాల బాలికలు 2012 సెప్టెంబర్ 18 నుంచి 2014 సెప్టెంబర్ 17 మధ్య జన్మించిన వారై ఉండాలి. అండర్ 16, 18లతో పాటు అండర్ 20 జట్లను ఎంపిక చేయనున్నారు. పాల్గొనే బాల బాలికలు ఒరిజినల్ జనన ధ్రువీకరణ పత్రంతో పాటు రూ.200 ప్రవేశ రుసుంతో హాజరుకావాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారిని తిరుపతిలో జరిగే రాష్ట్ర అంతర జిల్లాల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అర్హత కల్పించనున్నారు.
పోలింగ్ స్టేషన్లు సందర్శించిన డీఆర్‌వో
మహారాణిపేట: జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌వో) ఎం.విశ్వేశ్వర నాయుడు నగరంలో పలు సచివాలయాలు, పోలింగ్ స్టేషన్లను ఆదివారం సందర్శించారు. దక్షిణ నియోజకవర్గ పరిధి ఉడ్ యార్డు స్ట్రీట్‌లో పలు ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా డిజిటలైజేషన్, మ్యాపింగ్ జాబితాలపై ఆరా తీశారు.


