ప్రజా ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలు సహించం | - | Sakshi
Sakshi News home page

ప్రజా ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలు సహించం

Jul 13 2026 12:46 AM | Updated on Jul 13 2026 12:46 AM

వుడా కాలనీవాసుల ఆందోళనకు

వైఎస్సార్‌సీపీ మద్దతు

ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసిన

కాలనీ స్థలం పరిశీలన

అన్ని వేళలా అండగా ఉంటాం:

భీమిలి ఇన్‌చార్జ్‌ చిన్న శ్రీను

మధురవాడ: స్థానిక మిథిలాపురి వుడా కాలనీలో ప్రజల అవసరాల కోసం కేటాయించిన స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలు సరికాదని, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్‌సీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త, విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం కాలనీలోని మధురవాడ రెవెన్యూ గ్రామం సర్వే నం.278 పార్ట్‌లో ఉన్న పాత పోలీస్‌ స్టేషన్‌, దానిని ఆనుకుని ఉన్న 733 గజాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు వీఎంఆర్‌డీఏ అమ్మేయడంపై కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... లే అవుట్‌ ఏర్పాటు చేసినప్పుడు కాలనీ వాసుల సామాజిక అవసరాల కోసం కేటాయించామని చెప్పి, ఇప్పుడు వాటిని అమ్మేయడం సరికాదన్నారు. ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా అడ్డగోలుగా వ్యవహరించడం తగదన్నారు. ముఖ్యంగా ఇక్కడే 2019 ప్రాంతంలో గజం సుమారు రూ.95 వేలకు వెళ్లగా, ఇప్పుడు రూ.65 వేలకే ఈ–బిడ్డింగ్‌ పేరుతో కేటాయించడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పైగా కాలనీ వాసులకు న్యాయం చేస్తామని చర్చలు జరుపుతూనే, అర్ధరాత్రి వేళ పాత పోలీస్‌ స్టేషన్‌, సచివాలయం, గ్రంథాలయం నడిచిన ప్రభుత్వ భవనాన్ని కూల్చివేయడం సరికాదన్నారు.

ఆక్షన్‌ వేసినప్పుడు భవనం విలువ కట్టి, అన్ని రకాల అనుమతులు తీసుకునే భవనాన్ని కూలగొట్టారా? పారదర్శకంగానే ఇది జరిగిందా? ఎవరి స్వలాభం కోసం ఇలా చేశారన్న వాస్తవాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాలనీ వాసులతో కలిసి ఈ విషయాన్ని వీఎంఆర్‌డీఏ కమిషనర్‌, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ విషయాన్ని తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, ఇలాంటి వాటిపై సమగ్ర విచారణ చేయిస్తామని కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు.

కార్యక్రమంలో మిథిలాపురి ఉడా కాలనీ లే అవుట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు త్రిమూర్తులు రాజు, కార్యదర్శి ఎంవీ రమణమూర్తి, హౌసింగ్‌ స్కీం అసోసియేషన్‌ అధ్యక్షుడు మగ్గూరి వెంకటరావు, జేఏసీ సెక్రటరీ మాధవరావు, పుష్పవతి, వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు పోతిన హనుమంతరావు, ఏపీ నగరాల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షులు గుడ్ల పోలిరెడ్డి, పోతిన ప్రసాద్‌, పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, పిళ్లా సూరిబాబు, కుడితి రామారావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా వివిధ విభాగాల నాయకులు వంకాయల మారుతీ ప్రసాద్‌, ముదుండి రాజేశ్వరి, జగ్గుపిల్లి నరేష్‌, పిళ్లా సుజాత, చేకూరి రజని, తమ్మినేని వరలక్ష్మి, బంగారు ప్రకాశ్‌, బాడితిబోయిన రాములప్పడు, పోతిన శేషుబాబు, కాలనీకి చెందిన వివిధ అసోసియేషన్‌ల నాయకులు, కాలనీ వాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement