రారండోయ్‌.. వేడుక చూద్దాం! | - | Sakshi
Sakshi News home page

రారండోయ్‌.. వేడుక చూద్దాం!

Jul 13 2026 12:40 AM | Updated on Jul 13 2026 12:40 AM

నేటి నుంచి జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు

16న తొలి రథయాత్ర..

17 నుంచి దశావతారాలు

26న తిరుగు రథయాత్ర

ఆలయ

ముఖ ద్వారం

డాబాగార్డెన్స్‌: టౌన్‌కొత్తరోడ్డులోని జగన్నాథస్వామి ఆలయం రథయాత్ర మహోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 27 వరకు ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా జూలై 13న జ్యేష్ట బహుళ చతుర్దశి సందర్భంగా సాయంత్రం ప్రతిష్టా ప్రారంభ సంకల్పం నిర్వహిస్తారు. 14న(అమావాస్య) ఉదయం జలాధివాసం, క్షీరాధివాసం, రాత్రి విశేష హోమాలు, పంచశయ్యాధివాసాలు జరుగుతాయి. 15న ఆషాఢ శుద్ధ పాడ్యమి సందర్భంగా ఉదయం పూర్ణాహుతి, నేత్రోత్సవం, సాయంత్రం 6.30 గంటలకు ధ్వజారోహణం, అనంతరం సుభద్రాదేవి శాంతి కల్యాణం నిర్వహిస్తారు. 16న ఉదయం 9.05 గంటలకు స్వామివారిని రథంపైకి ఆహ్వానించి, సాయంత్రం 5 గంటలకు తొలి రథయాత్రను ఘనంగా నిర్వహిస్తారు. జూలై 17 నుంచి 25 వరకు టర్నర్‌ చౌల్ట్రీ కల్యాణ మండపంలో స్వామివారు దశావతార అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు.

ఆలయ చరిత్ర

విశాఖ నగర మెయిన్‌రోడ్డులోని శ్రీ జగన్నాథస్వామి ఆలయం సుమారు 185 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన వైష్ణవ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ప్రశాంత వాతావరణంతో పాటు వివిధ కళలకు నిలయంగా, భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. 1832లో గరుడా జగన్నాయకుల కుటుంబ సభ్యులు ప్రస్తుత ఆలయ ప్రాంగణంలో తవ్వకాలు చేపట్టగా, మహావిష్ణువు స్వరూపమైన శ్రీరంగనాథస్వామి పంచలోహ విగ్రహాలు వెలుగుచూశాయి. అనంతరం చిన్న తాటాకుల పాక నిర్మించి, చలమయ్య దీక్షితులను అర్చకులుగా నియమించారు. తర్వాత గరుడా వంశీయులు తమ ఆరాధ్య దైవమైన జగన్నాథస్వామి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించి, 1862లో పూర్తి చేశారు. అనంతరం పూరీ నుంచి జగన్నాథుడు, సుభద్రాదేవి, బలభద్రస్వామి విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్టించారు. 1864 నుంచి ఇక్కడ రథయాత్ర మహోత్సవాలను నిరంతరంగా నిర్వహిస్తున్నారు.

నిత్యపూజలు

జూలై 17 నుంచి 25 వరకు తొమ్మిది రోజులపాటు ప్రత్యేక నిత్యపూజలు నిర్వహిస్తారు. ఉదయం 5 నుంచి 6 వరకు స్వామివారి మేలుకొలుపు, నాదస్వర సేవ, 6 నుంచి 7 వరకు నిత్యపూజలు, ఉభయదాతల గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు, 7 నుంచి 9.30 వరకు జగన్నాథస్వామి ప్రార్థనా గానసంఘం ఆధ్వర్యంలో ప్రార్థనా తరంగిణి, 9.30 నుంచి 10.30 వరకు లలితా సహస్రనామ పారాయణం, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 వరకు సామూహిక భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. ప్రతిరోజూ సాయంత్రం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తొమ్మిది రోజుల పూజల్లో పాల్గొనాలనుకునే భక్తులు దేవస్థాన కార్యాలయంలో రూ.500 చెల్లించి తమ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించుకోవచ్చు. దశావతార అలంకరణలకు ఉభయదాతలుగా సేవలందించదలిచిన భక్తులు ముందుగా ఆలయ కార్యనిర్వాహణాధికారి టి.రాజగోపాలరెడ్డిని దేవస్థాన కార్యాలయంలో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.

26న తిరుగు రథయాత్ర

26న ద్వాదశి సందర్భంగా ఉదయం 9 గంటలకు స్వామివారిని రథంపైకి ఆహ్వానిస్తారు. సాయంత్రం 4.20 గంటలకు టర్నర్‌ చౌల్ట్రీ నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాలు, బాణసంచా, జగన్నాథ నామస్మరణ, వేదపండితుల పారాయణాల మధ్య తిరుగు రథయాత్రను వైభవంగా నిర్వహిస్తారు. 27న ఉదయం సంప్రోక్షణ, పీఠారోహణం అనంతరం స్వామివారిని యథాస్థానంలో ప్రతిష్టిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement