ఏయూ క్యాంపస్: ఆంధ్రప్రదేశ్ ఆర్థ్రోస్కోపీ అసోసియేషన్(ఏఏఏపీ) ఆధ్వర్యంలో తొలి రాష్ట్ర స్థాయి ఆర్థ్రోస్కోపీ సదస్సు ఘనంగా జరిగింది. బీచ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో ఆదివారం జరిగిన సదస్సుకు దేశవ్యాప్తంగా 25 మందికి పైగా మాస్టర్ ఫ్యాకల్టీ, 40 మంది రీజినల్ ఫ్యాకల్టీ హాజరయ్యారు. సదస్సులో భాగంగా విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రిలో మోకాలు, భుజం ఆర్థ్రోస్కోపీకి సంబంధించి ఆరు ప్రత్యక్ష శస్త్రచికిత్సలను నిర్వహించి, అత్యాధునిక శస్త్రచికిత్సా విధానాలను వైద్యులకు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ అధ్యక్షుడు డా.ఎస్.ఆర్.సుందరరాజా, ఉపాధ్యక్షుడు డా.పరాగ్ సంచేటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రముఖ నిపుణులు డా. సచిన్ తపస్వి, డా.భూషణ్ సబ్నిస్, డా.రోషన్ వాడే, డా.పూర్ణచంద్ర తేజస్వి, డా.అయ్యప్పన్ నాయర్ ప్రత్యక్ష శస్త్రచికిత్సలు నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 350 మందికి పైగా ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా నిర్వహించిన ఈ సదస్సును డా.అస్లాం ఆరిఫ్, డా.కె.ఎస్.ప్రవీణ్ కుమార్, డా.శ్రీధర్ గంగవరపు, డా.ఎన్.ఆశిష్ కుమార్‌లతో కూడిన కమిటీ విజయవంతంగా నిర్వహించింది.


