నిబంధనలకు విరుద్ధంగా
‘వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్’ పనులు
సీఆర్‌జెడ్ పరిధిలో విచ్చలవిడిగా
తవ్వకాలు.. ఇసుక తరలింపు
గతంలో హైకోర్టు బ్రేక్ వేసినా
కూటమి ప్రభుత్వం బేఖాతరు!
ప్రజాధనం దుర్వినియోగంపై
పర్యావరణ ప్రేమికుల ఆగ్రహం
కొమ్మాది: రూల్స్ లేవు.. కోర్టు తీర్పులు పట్టింపే లేదు. అంతా పాలకుల ఇష్టం! నాడు ఉన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసి, పనులను తక్షణమే తొలగించాలని ఆదేశించినా.. నేడు చంద్రబాబు ప్రభుత్వం అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ప్రముఖ పర్యాటక కేంద్రం రుషికొండ తీరంలో సీఆర్‌జెడ్ నిబంధనలను విచ్ఛిన్నం చేస్తూ రూ.3.35 కోట్ల ప్రజాధనంతో ‘వాటర్ స్పోర్ట్స్’ అక్రమ నిర్మాణాలపై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పచ్చని పర్యావరణంపై విధ్వంసం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ఐటీ హిల్స్ పేరుతో మధురవాడ పరిసరాల్లోని పచ్చని కొండలను తొలిచేస్తున్న పాలకుల కన్ను.. ఇప్పుడు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ తీరంపై పడింది. అభివృద్ధి పేరుతో సాగర తీరాన్ని ధ్వంసం చేసేందుకు వెనుకాడటం లేదు. రుషికొండ బీచ్ వద్ద సర్వే నెంబరు 61/1లో, తీరప్రాంత అభివృద్ధి పూర్తిగా నిషేధించబడిన స్థలంలో తీర నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్) నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నారు.
రూ. 3.35 కోట్లతో పనులు..
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జిల్లా క్రీడల శాఖ, వీఎంఆర్‌డీఏ సంయుక్తంగా రూ.3.35 కోట్ల వ్యయంతో ‘వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్’ను నిర్మిస్తున్నాయి. ఇది పూర్తిగా పర్యావరణ చట్టాలకు వ్యతిరేకమైనప్పటికీ అధికారులు సైతం విచ్చలవిడిగా పనులను కానిచ్చేస్తున్నారు. ఈ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఇప్పటికే తీరంలో భారీ గోతులు తవ్వి, అక్కడి ఇసుకను అక్రమంగా తరలించేశారు.
గతంలో కోర్టు మొట్టికాయలు..
గతంలో 2007 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేసి, పనులు కూడా ప్రారంభించింది. కొంతమేర నిర్మాణాలు కూడా చేపట్టింది. అయితే, దీనిపై అప్పట్లో పర్యావరణ ప్రేమికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ నిర్మాణాలను తక్షణమే ఆపివేసి, పూర్తి స్థాయిలో తొలగించాలని ఆదేశించింది. దీంతో అప్పట్లో ఆ నిర్మాణాలను వెనువెంటనే తొలగించారు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాత కోర్టు తీర్పును పూర్తిగా ఉల్లంఘిస్తూ.. మళ్లీ అదే స్థలంలో వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపట్టడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పూర్తి స్థాయిలో పర్యావరణ ఉల్లంఘనేనని పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చేపడుతున్న ఈ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తీర ప్రాంత విధ్వంసం ఆపండి
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ బీచ్‌లో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలి. గతంలో ఇదే ప్రదేశంలో నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలను కోర్టు అడ్డుకుంది. మళ్లీ ఇప్పుడు అభివృద్ధి పేరుతో తీర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తే ఊరుకునేది లేదు.
– తెడ్డు శంకర్రావు, కార్యదర్శి,
ఫిషర్‌మెన్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్


