కూర్మన్నపాలెం: అగనంపూడి సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. శనివాడ గ్రామానికి చెందిన బలిరెడ్డి కిశోర్(24) తన బైక్‌తో మైలురాయిని ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. దువ్వాడ పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. వ్యాన్ నడుపుతూ జీవనం సాగిస్తున్న కిశోర్, తన తల్లితో కలిసి శనివాడలో నివాసముంటున్నాడు. పని నిమిత్తం తన మోటార్ బైక్‌పై గాజువాక వెళ్లిన ఆయన, తిరిగి ఇంటికి వస్తుండగా టోల్‌గేట్ సమీపంలో చీకటి కారణంగా రహదారి పక్కనే ఉన్న మైలురాయిని బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కిశోర్ అక్కడికక్కడే మరణించాడు. కిశోర్ తండ్రి పైడిరాజు కొన్నాళ్ల కిందట మరణించారు. అప్పటి నుంచి కిశోర్ తన తల్లికి తోడుగా ఉంటున్నాడు. ఇప్పుడు కిశోర్ కూడా మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ కె.మల్లేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


