జీవీఎంసీ ఇక కలెక్టర్‌ కంట్రోల్‌! | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీ ఇక కలెక్టర్‌ కంట్రోల్‌!

Mar 11 2026 9:00 AM | Updated on Mar 11 2026 9:00 AM

డాబాగార్డెన్స్‌: విశాఖ నగర పాలనలో ఒక అధ్యాయం ముగిసి, మరో కీలక ఘట్టం ఆరంభం కానుంది. ఈ నెల 17తో జీవీఎంసీ ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం పూర్తి కానుండటంతో, నగరం మళ్లీ ప్రత్యేకాధికారి పాలనలోకి వెళ్తోంది. ప్రభుత్వం కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిరప్రసాద్‌ను జీవీఎంసీ ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కార్పొరేషన్‌లో ఇక కలెక్టర్‌ మార్క్‌ పాలన మొదలుకానుంది. తదుపరి ఎన్నికలు జరిగే వరకు కలెక్టర్‌ కంట్రోల్‌లోనే జీవీఎంసీ ఉండనుంది.

రాజకీయ చదరంగం.. ముగిసిన అంకం

2021లో మొదలైన ఈ పాలకవర్గ ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. 2021 ఏప్రిల్‌ నుంచి 2025 ఏప్రిల్‌ వరకు వైఎస్సార్‌ సీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో జియ్యాని శ్రీధర్‌, కటుమూరి సతీష్‌ డిప్యూటీ మేయర్లుగా వ్యవహరించారు. కుళ్లు, కుతంత్రాలు, అధికార దాహం, డబ్బులు వెదజల్లి బీసీ కులానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారిని మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ను తప్పించారు. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌ 28న మేయర్‌గా పీలా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్‌గా దళ్లి గోవిందరెడ్డి బాధ్యతలు చేపట్టగా, కటుమూరి సతీష్‌ మరో డిప్యూటీ మేయర్‌గా కొనసాగుతున్నారు. వీరిందరి పదవీకాలం ఈ నెల 17తో పూర్తి కానుంది.

పెండింగ్‌ పనుల చక్కబెట్టే పనిలో..

పాలకవర్గ గడువు ముగియడానికి కేవలం వారం రోజులే సమయం ఉండటంతో జీవీఎంసీలో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే చివరి కౌన్సిల్‌ సమావేశం కూడా ముగియడంతో, ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని పెండింగ్‌ పనులను చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

మళ్లీ పాతరోజులేనా?

నగరవాసుల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. మళ్లీ పాత రోజులే రాబోతున్నాయా? అని. గతంలో 2012 నుంచి 2021 వరకు జీవీఎంసీలో ఎన్నికలు జరగలేదు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారుల పాలనే సుదీర్ఘకాలం కొనసాగింది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే గ్రేటర్‌ విశాఖకు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఘన విజయం సాధించి, పాలన పగ్గాలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండటం, తక్షణమే ఎన్నికలు నిర్వహించే సూచనలు కనిపించకపోవడంతో, మరోసారి సుదీర్ఘ కాలం పాటు అధికారుల పాలనే కొనసాగే అవకాశం ఉందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యేకాధికారిగా

హరేందిర ప్రసాద్‌ నియామకం

మేయర్ల ప్రస్థానం ఇదీ

విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తొలి మేయర్‌గా బీజేపీకి చెందిన ఎన్‌.ఎస్‌.ఎన్‌.రెడ్డి పీఠం అధిష్టించారు. ఆయన 1981 నుంచి 1986 వరకు నగర ప్రథమ పౌరుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 1987లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి చెందిన డీవీ సుబ్బారావు మేయర్‌గా ఎన్నికై 1992 వరకు కొనసాగారు. అనంతరం 1995 నుంచి 2000 వరకు కాంగ్రెస్‌ నేత సబ్బం హరి నగర మేయర్‌గా పాలన సాగించారు. 2000లో కాంగ్రెస్‌కు చెందిన రాజాన రమణి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు తొలి మహిళా మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆమె 2005 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ తరువాత 2005 నుంచి 2007 వరకు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగలేదు. అయితే, అప్పటి ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ గ్రేటర్‌ విశాఖ(జీవీఎంసీ)గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత 2007లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పులుసు జనార్దన్‌ మేయర్‌గా, కె. దొరబాబు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. వీరు 2012 వరకు తమ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత టీడీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా 2012 నుంచి 2021 వరకు జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించలేదు. సుదీర్ఘ విరామం తర్వాత 2021 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయం సాధించింది. దీంతో గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు తొలి మహిళా మేయర్‌గా బీసీ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకట కుమారి బాధ్యతలు చేపట్టారు. ఆమె నాలుగేళ్ల పాటు పాలన సాగించారు. కాగా, మార్పుల్లో భాగంగా గత ఏడాది ఏప్రిల్‌ 28వ తేదీ నుంచి పీలా శ్రీనివాసరావు మేయర్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement