మధురవాడ: విశాఖలో అవినీతి నిరోధక శాఖ మెరుపు దాడులతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగంపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో మధురవాడ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు.
ఏసీబీ ఇన్స్‌పెక్టర్లు లక్ష్మణరావు, వెంకటరావుల ఆధ్వర్యంలో అధికారులు టౌన్‌ప్లానింగ్ విభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఫైళ్లు, పత్రాలు పరిశీలించారు. ఏసీపీ శబ్నాన్ శాస్త్రితో పాటు సిబ్బందిని విచారించారు. కొంతమంది ఉద్యోగుల మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఇటీవల మంజూరైన భవన ప్లాన్‌లు, ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలపై అధికారులు ఆరా తీశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయా అన్న కోణంలో పరిశీలించారు. ఈ సందర్భంగా పలు ఫైళ్లు, కంప్యూటర్ డేటాను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ దాడుల వార్త బయటకు రావడంతో జీవీఎంసీ అధికారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కొంతమంది అధికారులు కార్యాలయాలకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు చర్చ జరుగుతోంది.


