ట్రక్ క్లీనర్‌ను రక్షించిన సీఐఎస్‌ఎఫ్ ఫైర్ సిబ్బంది
ఉక్కునగరం: పిట్‌లో ప్రమాదవశాత్తు పడి కొట్టుకుంటున్న ట్రక్ క్లీనర్‌ను సీఐఎస్‌ఎఫ్ ఫైర్ సిబ్బంది సకాలంలో రక్షించారు. వివరాలివి.. కర్నూల్‌కు చెందిన ట్రక్ డ్రైవర్ కృష్ణారెడ్డి, క్లీనర్ తలారి కౌలుట్ల స్టీల్‌ప్లాంట్‌కు ట్రక్‌లో సిలికాన్ మెగ్నీషియాన్ని తీసుకొచ్చారు. ప్లాంట్‌లోని ఫెర్రో స్టోర్‌కు చేరుకుని మెటీరియల్ అన్‌లోడింగ్‌కు ట్రక్ పెట్టారు. అక్కడ నుంచి తప్పిపోయిన కౌలుట్ల ఎల్‌ఎంఎం విభాగం సమీపంలోని ఆయిల్ పిట్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఏం జరిగిందో తెలీదు కాని కొద్దిసేపటికి 20 అడుగుల లోతులో ఉన్న ఆయిల్ పిట్ నుంచి అరుపులు వినిపించాయి. అటుగా వెళ్లున్న ఉద్యోగులు వెంటనే సీఐఎస్‌ఎఫ్ ఫైర్ విభాగానికి సమాచారం అందించారు. వారు మొదట తాడుతో ప్రయత్నించారు. అది జారి పోతుండటంతో ఎట్టకేలకు అగ్నిమాపక నిచ్చెన ద్వారా బయటకు తీశారు. అతని కోసం అప్పటికే ప్రయత్నిస్తున్న డ్రైవర్ కృష్ణారెడ్డి అక్కడకు చేరుకుని కౌలుట్ల మానసిక స్థితి బాలేదని చెప్పారు. వెంటనే అతన్ని సీఐఎస్‌ఎఫ్ వాహనంలో బీసీ గేటు బయటకు తరలించారు. ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షించిన ఫైర్ సిబ్బందిని ఉద్యోగులు అభినందించారు.


