క్రీడలతో మానసిక ఆరోగ్యం
మురళీనగర్: క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం చేకూరుతుందని ఎంపీ ఎం. శ్రీభరత్ పేర్కొన్నారు. సోమవారం విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 28వ ప్రాంతీయ స్థాయి అంతర పాలిటెక్నిక్ క్రీడలు, ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని 24 పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 816 మంది క్రీడాకారులు పాల్గొంటున్న ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలేజీ ప్రాంగణంలోని నిరుపయోగంగా ఉన్న బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన ఎంపీ, తుప్పలను తొలగించి వసతులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ పులిపాటి కింగ్, గండి బాబ్జీ, జోనల్ కమిషనర్ రాము, అర్జున అవార్డు గ్రహీత సీరా జయరాం తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై కళావేదికను నిర్మించిన పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు.


