రైల్వే అభివృద్ధి పనుల వేగవంతానికి జీఎం ఆదేశం
తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ సోమవారం విస్తృతంగా పర్యటించి, పలు రైల్వే యూనిట్లు, అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. డీఆర్‌ఎం లలిత్ బోహ్రాతో కలిసి ముడసర్లోవలో నిర్మాణంలో ఉన్న దక్షిణ కోస్తా రైల్వే నూతన జోనల్ కార్యాలయ భవన పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డీజిల్ లోకోషెడ్‌ను సందర్శించి, ఎలక్ట్రికల్ లోకోల నిర్వహణపై జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. వడ్లపూడి వర్క్‌షాప్‌లోని సదుపాయాలను, విశాఖ రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్ స్టేషన్ పనుల ప్రగతిని సమీక్షించారు. ప్రయాణికుల సౌకర్యాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం అరణ్య క్యాంపింగ్ ఏరియాలో జరిగిన 4వ రాష్ట్ర స్థాయి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ర్యాలీ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, క్యాంప్ ఫైర్‌ను ప్రారంభించారు. అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచిన స్కౌట్స్ బృందాలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.


