భిన్నత్వంలో ఏకత్వంపై కార్పొరేట్ దాడి
ఏయూక్యాంపస్ : భారతదేశ ప్రత్యేకత అయిన భిన్నత్వంలో ఏకత్వంపై ప్రస్తుతం కార్పొరేట్ శక్తులు దాడి చేస్తున్నాయని ప్రముఖ ప్రజాకవి, సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆవేదన వ్యక్తం చేశారు. బీచ్ రోడ్డులో జరుగుతున్న సీఐటీయూ అఖిల భారత మహాసభల్లో భాగంగా సోమవారం నిర్వహించిన ‘శ్రామికోత్సవ’ వేదికపై ఆయన మాట్లాడారు. తాను సినీ కవిగా కంటే ముందే భవన నిర్మాణ కూలీగా పనిచేశానని, తన పెన్నులో సిరా కాదు.. శ్రామికుల రక్తం, చెమట ఉంటాయని పేర్కొన్నారు. శ్రీశ్రీ తర్వాత కార్మిక, కర్షక జనం కోసం అత్యధిక పాటలు రాసింది తానేనని ఆయన సగర్వంగా చెప్పారు. ‘విశాఖ ఉక్కును అమ్మేదెవడు.. కొనేదెవడు’ వంటి పాటలు రాసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ప్రాణం ఉన్నంతవరకు ప్రజా గళం వినిపిస్తూనే ఉంటానన్నారు. బిడ్డకు తల్లి పాలు పట్టడానికి బదులు కల్లు పట్టే దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల సమస్యలు, స్వాతంత్య్రం తర్వాత కూడా నెలకొన్న దౌర్భాగ్య స్థితిగతులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ పాటలు, కవితలతో సభికుల్లో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి తపన్ సేన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగ రావు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, శ్రామిక ఉత్సవ్ కన్వీనర్ కె.రమాప్రభ, సీతాలక్ష్మి, దర్శకులు యాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పలు గీతాలు, నృత్యాలతో కళాకారులు అలరించారు.


