అందెల సవ్వడి.. నాట్యమే ఆమె ఊపిరి | - | Sakshi
Sakshi News home page

అందెల సవ్వడి.. నాట్యమే ఆమె ఊపిరి

Nov 22 2025 7:50 AM | Updated on Nov 22 2025 7:50 AM

అందెల సవ్వడి.. నాట్యమే ఆమె ఊపిరి

అందెల సవ్వడి.. నాట్యమే ఆమె ఊపిరి

● కళాఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చుతున్న సన్నిధ రాజసాగి ● సంస్కృతి పరిరక్షణే లక్ష్యంగా సాగుతున్న నృత్య ప్రస్థానం

మద్దిలపాలెం: అందం, అభినయం కలగలిపితే సన్నిధ రాజసాగి. నవనీతం ఆమె నాట్య నయన విన్యాసం. ఆమె అందెల సవ్వడితో చేసే లయ సమన్వయం అద్భుతం. నేటి ఆధునిక యువత సాఫ్ట్‌వేర్‌ రంగం వైపు, ఐదంకెల జీతాల కోసం పరుగులు తీస్తుంటే.. ఆమె మాత్రం మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేసి, మన మూలాలను భావితరాలకు అందించాలని సంకల్పించారు. పుస్తకాలతో కుస్తీ పట్టే వయసులోనే కాళ్లకు గజ్జెలు కట్టి, కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు. నాట్యంలో పట్టు సాధించి.. దేశ, విదేశాలలో అద్భుత ప్రదర్శనలు ఇచ్చి.. మన కళా ఖ్యా తిని ఖండాంతరాలకు విస్తరింపజేస్తున్నారు. నగరానికి చెందిన సన్నిధ రాజసాగి తన నృత్య ప్రస్థానం గురించి ‘సాక్షి’తో పంచుకున్న వివరాలివి..

మూడున్నరేళ్ల ప్రాయంలో..

నేను కూచిపూడి నేర్చుకోవడం చాలా చిన్న వయసులో, అంటే మూడున్నర ఏళ్లకే మొదలైంది. ఒక రోజు అమ్మ సుభాదేవి టీవీలో చానళ్లు మారుస్తూ ఒక వైపు క్లాసికల్‌ డ్యాన్స్‌, మరో వైపు వెస్టర్న్‌ డ్యాన్స్‌ చూపించి.. ‘నువ్వు ఏది నేర్చుకోవాలనుకుంటున్నావ్‌?’ అని అడిగిందట. అప్పుడు నేను ‘క్లాసికల్‌ డాన్స్‌’నే ఎంచుకున్నానని చెప్పేది. అలా నా నృత్య ప్రయాణం ప్రారంభమైంది.

నాన్నకు బదిలీలు.. శిక్షణ ఒక్కోచోట!

మా నాన్న డి.చంద్రశేఖర్‌ వర్మ ఒక కంపెనీలో ఫ్యాక్టరీల డైరెక్టర్‌గా పనిచేసేవారు. ఆయన ఉద్యోగ రీత్యా మేము తరచుగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారాల్సి వచ్చేది. ఆ ప్రయాణంలో మేము ఏలూరులో ఉన్నప్పుడు నా కూచిపూడి శిక్షణకు అంకురార్పణ జరిగింది. ఒకటో తరగతిలో ఉన్నప్పుడు పార్వతి రామచంద్రన్‌ వద్ద నాట్యంలో ఓనమాలు దిద్దాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో వైకుంఠ నారాయణమూర్తి వద్ద రెండేళ్లు శిక్షణ పొందాను. అనంతరం విశాఖలోని కూచిపూడి కళాక్షేత్ర ప్రిన్సిపాల్‌ హరి రామమూర్తి వద్ద నా శిక్షణ నిరంతరాయంగా సాగింది. నేటికీ నా గురువులతో అనుబంధం ఉంది. వారి పర్యవేక్షణలోనే నాట్య ముద్రికల్లోని ఎన్నో మెళకువలను, అద్భుతాలను నేర్చుకున్నాను.

పరిశోధన దిశగా..

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో డ్యాన్స్‌లో డిప్లమో పూర్తి చేసి, ప్రస్తుతం అక్కడే మాస్టర్‌ డిగ్రీ చేస్తున్నాను. శాసీ్త్రయ నృత్యంలో లోతైన పరిశోధన చేసి, మన సంస్కృతి గొప్పతనాన్ని భావితరాలకు అందించాలన్నదే నా తపన. అందుకోసమే 2017లో ‘నాట్యాలయ వేర్‌ డ్యాన్స్‌ ఈజ్‌ ఏ ప్రేయర్‌’ అనే డ్యాన్స్‌ స్కూల్‌ను స్థాపించాను. దీని ద్వారా 2024లో ‘హేరంబ డ్యాన్స్‌ ఫెస్టివల్‌’ను కూడా విజయవంతంగా నిర్వహించాం.

కుటుంబమే నా బలం

కళారంగంలో నేను రాణించడానికి నా కుటుంబం నాకు వెన్నుదన్నుగా నిలిచింది. నా తల్లిదండ్రులు సుభాదేవి, చంద్రశేఖర్‌ వర్మ అందించిన ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. వివాహం తర్వాత మావయ్య రాజసాగి వజ్రకుమార్‌ రాజు, అత్తయ్య సుశీలమ్మ, నా భర్త వెంకట విశ్వనాథ లక్ష్మీకుమార రాజుల సహకారం ఎంతో ఉంది.

2014లో నాట్య రంగ ప్రవేశం

2014 జనవరి 10న మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో గురువు హరి రామమూర్తి పర్యవేక్షణలో కూచిపూడిలో నా అరంగేట్రం జరిగింది. ఆ తర్వాత నాట్యాంజలి డ్యాన్స్‌ ఫెస్టివల్‌, లాస్యకల్ప డ్యాన్స్‌ ఫెస్టివల్‌, దర్పణ, నవనీతం, సరస్వతి గాన సభ, ఐసీసీఆర్‌ వంటి వేదికలపై ప్రదర్శనలిచ్చాను. మన దేశంలోనే కాకుండా కాలిఫోర్నియా, డెట్రాయిట్‌, అట్లాంటా, డల్లాస్‌, న్యూజెర్సీ, రిచ్‌మండ్‌ వంటి విదేశీ నగరాల్లోనూ ప్రదర్శనలిచ్చి ప్రశంసలు పొందడం నాకు గొప్ప అనుభూతినిచ్చింది.

మరపురాని ప్రశంస

ప్రముఖ నాట్యచార్యులు వెంపటి రవిశంకర్‌ ఇచ్చిన ప్రశంస నా జీవితంలోనే అత్యుత్తమమైనది. ‘నీ అభినయమే నీకు గొప్ప బలం’అని నా ప్రదర్శన చూసి మెచ్చుకున్నారు. ఆ మాటలు నాలో ఎంతో పట్టుదలను, నాట్యంలో మరింత ఎదగాలనే కాంక్షను పెంచాయి.

పురస్కారాలు, అవార్డులు

కళా పురస్కారం, సత్యభామ అవార్డు, నాట్య కౌముది, నాట్య సుందరి, నాట్య విశారద వంటి పురస్కారాలతో సత్కారాలు పొందాను. చిన్నతనంలోనే సీసీఆర్‌టీ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యాను, ఆ తర్వాత హెచ్‌ఆర్‌డీ స్కాలర్‌షిప్‌ కూడా పొందాను. ప్రస్తుతం దూరదర్శన్‌లో ‘ఏ’గ్రేడ్‌ కళాకారిణిగా రాణిస్తున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement