ఉద్దానం కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం
డాక్టర్ టి.రవిరాజు వెల్లడి
మహారాణిపేట : శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం ప్రారంభించామని, ఈ ప్రాంతంలో 18 శాతం జనాభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందని కిడ్నీ వ్యాధుల పరిశోధన ప్రాజెక్టు మెంబర్, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. శుక్రవారం ఆంధ్ర వైద్యకళాశాల డాక్టర్ అంబేడ్కర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కిడ్నీ వ్యాధులపై పరిశోధనలకు రూ.6.01 కోట్లతో అనుమతి ఇచ్చిందన్నారు. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు. ఉద్దానం ప్రాంతంలోని ఇచ్చాపురం, కవిటి, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరుల్లో అధ్యయనం జరుగుతుందన్నారు. కిడ్నీ వ్యాధుల మూలాలు కనుగొనేందుకు తొలి విడతలో 5,500 మంది నుంచి నమూనాలు సేకరిస్తామని తెలిపారు. ఆర్‌ఎన్‌ఏ సీక్వెన్సింగ్ విధానంలో జన్యుపరమైన పరీక్షలు కూడా ఈ పరిశోధనలో భాగంగా చేస్తామన్నారు. ఉద్దానంలోని వేర్వేరు ప్రాంతాల్లో మట్టి, నీరు, గాలి, వరిచేను, చేపలు, కూరగాయల నమూనాలు సేకరించి కూడా పరీక్షించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కేజీహెచ్ కిడ్నీ వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ జి.ప్రసాద్, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.


