ప్రైవేట్ పాఠశాలల దందా
పరీక్ష ఫీజుకు ‘పది’ రెట్లు వసూలు
ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లపై ఫిర్యాదులు
ఆరిలోవ: జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఒక వైపు వేలల్లో స్కూల్ ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు.. మరో పక్క పరీక్షల పేరుతో పిండేస్తున్నారు. ప్రస్తుతం 2025–26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజును కూడా సొమ్ము చేసుకొంటున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు గోరంత అయితే.. విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నది కొండంత అన్నట్లుగా ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుకు దాదాపు పది రెట్లు అధికంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు వసూలు చేస్తున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ ఈ నెల 17 నుంచి 30 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. 10వ తరగతి చదువు తున్న రెగ్యులర్ విద్యార్థులు ప్రభుత్వా నికి రూ.125 పరీక్ష ఫీజు చెల్లించాలి. జిల్లా విద్యా శాఖ అధికారులు ఈ విషయాన్ని పాఠశాలల యాజమాన్యాలకు తెలియజేశారు. గడు వులోగా చెల్లించలేని విద్యార్థులు ఆలస్య రుసుంతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ప్రతి పాఠశాల నుంచి పదో తరగతి విద్యార్థుల వివరాలను అప్‌లోడ్ చేయాలని కూడా సూచించారు.
రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు...
విద్యాశాఖ అధికారుల సూచనలను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు పక్కనపెట్టేశాయి. తమ సొంత నిర్ణయం మేరకు విద్యార్థుల నుంచి అధికంగా పరీక్ష ఫీజులు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
● బడ్జెట్ పాఠశాలలు అని పిలుచుకునేవి 10వ తరగతి విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు రూపంలో దాదాపు రూ.1,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
● కార్పొరేట్ పాఠశాలల్లో అయితే విద్యార్థుల నుంచి రూ.1,500 నుంచి రూ. 2,000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
● ఇంత ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారంటూ తల్లిదండ్రులు పాఠశాలల యాజమాన్యాలను ప్రశ్నిస్తే.. వారు పలు రకాల కారణాలు చెబుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజుతో పాటు డీఈవో కార్యాలయంలో ఇవ్వాల్సిన ఖర్చులు, స్టడీ మెటీరియల్, 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో పేపర్ల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పి వారిని పంపించేస్తున్నారట. పబ్లిక్ పరీక్షల సమయంలో తమ పిల్లల భవిష్యత్‌కు ఎలాంటి విఘాతం కలుగుతుందోనని భయపడి, తల్లిదండ్రులు నిస్సహాయతతో వెనుదిరుగుతున్నారు. నెలవారీ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పరీక్ష ఫీజు అదనపు భారంగా మారి తలలు పట్టుకొంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కలిపి ఈ విద్యా సంవత్సరంలో సుమారు 50,000 మంది 10వ తరగతి చదువుతున్నారు. ప్రభుత్వానికి చేరే ఫీజు రూ.125 చొప్పున లక్షల్లో ఉండగా, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వసూలు చేసే మొత్తం కోట్లలో ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అధిక ఫీజు వసూలు చేస్తే
చర్యలు
ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజు మాత్రమే విద్యార్థులు పాఠశాలల్లో చెల్లించాలి. అంతకంటే ఎక్కువగా వసూలు చేసే పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అధికంగా ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై డీఈవో కార్యాలయంలో ఫిర్యాదులు చేయవచ్చు. డిసెంబరు 11లోగా 10వ తరగతి విద్యార్థుల వివరాలను పాఠశాల ఉపాధ్యాయులు udise పోర్టల్ లాగిన్ ద్వారా https://udiseplus.gov. in/లో పొందుపరచాలి. – ఎన్.ప్రేమకుమార్,
జిల్లా విద్యా శాఖాధికారి


