ఎంపీపీ మజ్జి శారదా ప్రియాంక
తగరపువలస: తర్లువాడలో గూగుల్ టెక్‌కు ప్రభుత్వం భూములు కేటాయింపు వ్యవహారంలో ఎల్లో మీడియా వైఎస్సార్ సీపీపై బురదచల్లే వార్తలు ప్రచురించిందని ఎంపీపీ మజ్జి శారదా ప్రియాంక మండిపడ్డారు. శుక్రవారం ఆమె తర్లువాడలో తన తండ్రి, వైఎస్సార్‌సీపీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం డి పట్టా భూములను రైతుల నుంచి సేకరించేటప్పుడు చేసిన సర్వేలో 50 నుంచి 60 మంది రైతులకు సమాచారం లేదన్నారు. వారి తరపున ప్రతినిధిగా పరిహారం కోరేందుకు, డీఆర్‌డీఏలో నమోదు చేసుకున్న పంచాయతీలో 520 మందికి ఇళ్ల స్థలాలు అడిగేందుకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్‌కు వినతిపత్రం ఇచ్చారన్నారు. ఎల్లో మీడియా దీనిని పక్కన పెట్టి గూగుల్‌టెక్‌కు భూములు ఇచ్చేందుకు తన తండ్రి ఆమోదపత్రం ఇచ్చారని అబద్దాలు అచ్చేశారన్నారు. వాస్తవానికి 2023 మేలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అదానీ డేటా సెంటర్‌కు భూమి పూజ చేసినప్పుడే గూగుల్‌టెక్ ఏర్పాటుకు బీజం పడిందన్నారు. దానినే ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తుంది తప్ప వారి గొప్పతనం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావు మాట్లాడుతూ గూగుల్‌టెక్ ఏర్పాటు వంటి అభివృద్ధి విషయంలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుకు ముందుచూపు ఉందన్నారు. తర్లువాడలో ఎకరం భూమి రిజిస్ట్రేషన్ ధర రూ.17 లక్షలే ఉండగా తమ సమీప పంచాయతీ అయిన పందలపాకలో రూ.30 లక్షలు, శొంఠ్యాంలో రూ.90 లక్షలు ఉందన్నారు. దీనిని ఎమ్మెల్యే గంటా ద్వారానే ఆర్డీవో, కలెక్టర్‌ల దృష్టికి తీసుకువెళ్లి ఎకరం రూ.20 లక్షలకు పెంచుకోగలిగామన్నారు. అలాగే రైతులకు 20 సెంట్లు భూమి, మూడు సెంట్లు ఇళ్ల స్థలం, ఉద్యోగాలు వంటి డిమాండ్లు పెట్టి కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విజయం సాధించామన్నారు. స్థానికునిగా, ఎంపీపీ ప్రతినిధిగా వెళ్లిన తాను గూగుల్‌టెక్‌కు భూములు ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్టు వచ్చిన వార్తలు ఎల్లో మీడియా దగాకోరు తనానికి నిదర్శనమన్నారు. సమావేశంలో కోరాడ ఆదినారాయణ, మరుపిల్ల చిన్నారావు, మజ్జి నాగేంద్ర, మజ్జి గోవింద తదితరులు పాల్గొన్నారు.


