ఉత్తరలో భరత్ పెత్తనం
‘విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడేవారు తగ్గిపోయారు. ఎవరూ పనిచేయడం లేదు..
అందుకే కొత్తవాళ్లను వార్డు అధ్యక్షులుగా, బూత్ కన్వీనర్లుగా నియమిస్తున్నాం’.. అని ఇటీవల టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ భరత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ముఖ్యంగా పార్టీ
ఆవిర్భావం నుంచి నమ్ముకొని ఉన్న వారి విషయంలో భరత్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎంపీపై రోజు రోజుకీ సొంత పార్టీలోనే వ్యతిరేక కుంపటి పెరుగుతూ వస్తోంది.
సాక్షి, విశాఖపట్నం: ‘ఇది నా సంస్థానం.. ఇక్కడ నా మాటే శాసనం అన్నట్లు’గా విశాఖ ఎంపీ భరత్.. ఉత్తర నియోజకవర్గ టీడీపీ నేతలతో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరలో భరతుడు పెత్తనాన్ని అక్కడి పార్టీ సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉత్తర నియోజకవర్గంలో ఇటీవల వార్డు అధ్యక్షులు, బూత్ కన్వీనర్లను మార్పు చేశారు. ఎప్పటి నుంచో పసుపు జెండాను నెత్తిన పెట్టుకొని పార్టీని కాపాడుకుంటూ వస్తున్న వారిని కాదని.. సొంత టీమ్‌ని భరత్ ఏర్పాటు చేసుకోవడంపై సీనియర్లంతా గుర్రుగా ఉన్నారు. ఈ విషయంపై కొందరు నేతలు ప్రశ్నించగా.. ‘ఇది నా ఇష్టం.. నాకు నచ్చిన వారిని పెట్టుకుంటానంటూ’ ఎంపీ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఉత్తర ఎమ్మెల్యేగా బరిలో దిగుతాననీ.. ఇక్కడ తాను చెప్పిందే జరగాలంటూ ఒంటెద్దు పోకడలు అవలంబిస్తుండటంపై ఇటీవల చంద్రబాబుకు నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయినా బాబు ఏమాత్రం పట్టించుకోకపోవడంపైనా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పక్క నియోజకవర్గం నేతలకు పదవులు?
ఇటీవల ఉత్తర నియోజకవర్గంలో పరిధిలోని 14, 25, 44, 45, 47, 49, 55 వార్డులతో పాటు మరో నాలుగైదు వార్డుల్లో టీడీపీ అధ్యక్షుల మార్పు జరిగింది. అయితే చాలా వార్డుల్లో పక్క నియోజకవర్గాలకు చెందిన వారికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు ముగ్గురిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగానూ విమర్శలొస్తున్నాయి. ఇన్నాళ్లూ వార్డు అధ్యక్షులుగా పార్టీ కోసం పనిచేసిన వారిని పూర్తిగా పక్కన పెట్టడంతో.. వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2013 నుంచి పార్టీని కాపాడుకుంటూ ఉన్న వారిని, గత ఎమ్మెల్యే గంటాకు అనుచరులుగా ఉన్న వారిని కూడా పక్కన పెట్టేశారని తెలుస్తోంది. పార్టీ జెండా కూడా పట్టుకోని వారికి బూత్ కన్వీనర్లు, వార్డు అధ్యక్షులుగా ఇచ్చేశారంటూ వారంతా మండిపడుతున్నారు. ఇలాంటి వారికెలా పదవులు ఇస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీని ప్రశ్నిస్తే.. తనకేం సంబంధం లేదన్నట్లు చేతులెత్తేసినట్లు సమాచారం. భరత్‌తో గొడవ పెట్టుకుంటే రాజకీయ మనుగడ ఉండదని భయంతో కొందరు సీనియర్లు మౌనం వహిస్తున్నారు.
హోదాను మరిచి.. నియోజకవర్గ వ్యవహారాలు?
ఎంపీ భరత్ వ్యవహార శైలి పార్టీలో కొందరు ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. ఎంపీ హోదాను మరిచి కేవలం నియోజకవర్గ స్థాయిలో ఆలోచనలు చేస్తున్నారని గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఉత్తర నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న గంటా శ్రీనివాసరావు భీమిలి వెళ్లిపోయాక.. కొత్త ఇన్‌చార్జ్‌ని నియమించుకుండా భరత్ ఆపేస్తున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిని నియమిస్తే.. పెత్తనం చెలాయించడం కష్టమవుతుందనే ఉద్దేశంతో ఆపేశారంటూ దుయ్యపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న సీనియర్లకు విలువ లేకుండా రాజకీయాలు చేయడం తగదని అంటున్నారు. ఈ విషయంపై ఇటీవల నగరానికి వచ్చిన చంద్రబాబు దృష్టికి పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు తీసుకెళ్లారని.. ఆయన కూడా స్పందించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డు అధ్యక్షులుగా వెలగబెడుతున్న ఎంపీ బ్యాచ్.. ఇప్పటికే ఆయా వార్డుల్లో అధికార దందాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కొత్తగా పింఛన్లు, ఇళ్లు ఇస్తామనీ.. టౌన్‌ప్లానింగ్ సమస్యలు పరిష్కరిస్తామంటూ వసూళ్లు కూడా మొదలు పెట్టారని సొంతపార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యం వహించాలని చూస్తే.. టైమ్ వచ్చినప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ టీడీపీ రాష్ట్ర నేతల ఎదురుగానే సీనియర్లు వార్నింగ్ ఇవ్వడం కొసమెరుపు.
ఎంపీ వ్యాఖ్యల దుమారం
అబ్జర్వర్ల లిస్టును పక్కన పెట్టేసి..!
ఉత్తర నియోజకవర్గంలో వార్డు అధ్యక్షులను నియమించేందుకు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి అబ్జర్వర్లను పంపించారు. ఎవరు అర్హులనేదానిపై జాబితా తయారు చేయగా.. ఆ లిస్ట్‌ని ఎంపీ పూర్తిగా మార్చేసి.. తాను పంపించిన లిస్టులో ఉన్న వారికే పదవులివ్వాలని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. రెండు సార్లు వార్డు అధ్యక్షులుగా పనిచేసిన వారిని మార్చేస్తామని చెప్పారని.. అయితే గొర్లె అప్పారావు, సనపల వరప్రసాద్ ఏళ్ల తరబడి వార్డు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారని.. మరి వారినెందుకు మార్చలేదంటూ కొందరు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.


