వెటరన్‌ సైనికులకు సలాం | - | Sakshi
Sakshi News home page

వెటరన్‌ సైనికులకు సలాం

Nov 21 2025 7:43 AM | Updated on Nov 21 2025 7:43 AM

వెటరన్‌ సైనికులకు సలాం

వెటరన్‌ సైనికులకు సలాం

సాక్షి, విశాఖపట్నం: ఐఎన్‌ఎస్‌వీ తరణి, ఐఎన్‌ఎస్‌వీ తరంగిణి, ఐఎన్‌ఎస్‌వీ తురియా.. ఇలా భిన్నమైన సెయిలింగ్‌ యాత్రల్లో రాణిస్తున్న భారత నౌకాదళ అధికారులు.. దేశ రక్షణ దళ సాహసాల్ని ప్రపంచానికి చాటిచెబుతున్నారు. తాజాగా తెలుగువారైన ఇద్దరు రిటైర్డ్‌ రక్షణ దళ అధికారులు ఆరు పదుల వయసులో సముద్రాన్ని జయించారు. పోలాండ్‌కు చెందిన టైస్టీ అనే ఓషన్‌ క్రూజింగ్‌ యాట్‌లో 191 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం గురువారం మధ్యాహ్నం విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరుకున్నారు. టైస్టీ సెయిల్‌కు ఐఎన్‌ఎస్‌వీ విశాఖగా నామకరణం చేయనున్నట్లు ఇండియన్‌ నేవీ ప్రకటించింది. త్వరలోనే రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు.

రక్షణ విభాగంలోని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో విధులు నిర్వర్తించి రిటైర్‌ అయిన కల్నల్‌ కె.శ్రీనివాస్‌, ఇండియన్‌ నేవీలో విధులు నిర్వర్తించి రిటైర్‌ అయిన కెప్టెన్‌ సీడీఎన్‌వీ ప్రసాద్‌ మే 13న న్యూజిలాండ్‌లోని ఓపువా బేలో ఈ సాహసయాత్రను ప్రారంభించారు. పోలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ అయిన టైస్టీ అనే నావలో అత్యంత సాహసోపేతమైన వీరి యాత్ర పదికి పైగా పోర్టుల మీదుగా సాగింది. న్యూజిలాండ్‌ నుంచి తొలుత ఫిజీ చేరుకున్న వీరికి ఘన స్వాగతం లభించింది. ఇక అక్కడ నుంచి మరింత ఉత్సాహంతో ముందుకు సాగారు. పోర్టు విలా, సోలమన్‌ దీవులు, ఇండోనేషియాలోని కుపాంగ్‌, బాలీ, మలేషియాలోని పెనాంగ్‌, లంకావి, థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌, శ్రీవిజయపురం మీదుగా గురువారం సాయంత్రం విశాఖకు చేరుకుంది. దాదాపు 6 వేల నాటికల్‌ మైళ్లకు పైగా వీరి ప్రయాణం సాగింది.

ఇద్దరూ కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ విద్యార్థులే..

కల్నల్‌ శ్రీనివాస్‌, కెప్టెన్‌ ప్రసాద్‌ ఇద్దరూ కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ విద్యార్థులే కావడం విశేషం. 1971 బ్యాచ్‌గా సైనిక్‌ స్కూల్‌లో విద్యనభ్యసించిన అనంతరం.. 1980లో నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలోనూ 63వ బ్యాచ్‌లో ఒకేసారి శిక్షణ పొందారు. వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించినా.. చిన్నతనం నుంచి కలిసి చదువుకున్న శ్రీనివాస్‌, ప్రసాద్‌.. మంచి స్నేహితులుగానే కొనసాగుతూ.. రిటైర్‌ అయిన తర్వాత ఇద్దరూ కలిసి సాహసయాత్రకు ఉపక్రమించడం.. దాన్ని విజయవంతంగా పూర్తి చేయడం గర్వకారణమని భారత రక్షణదళం అభినందనలు తెలిపింది. ఈ యాత్ర తెలుగు వారి ధైర్య సాహసాలకు ప్రతీకగా సాగిందని తూర్పు నౌకాదళ అధికారులు కొనియాడారు.

టైస్టీ వివరాలు

విజయవంతంగా ఇండో పసిఫిక్‌ సముద్రయానం పూర్తి

కాలికి గాయమైనా ఆపలేదు

ఓపువాలో ప్రారంభమైన తర్వాత సోలోమన్‌ దీవుల్లోని పోర్టు నోరాలో మొదటిసారిగా విరామం తీసుకోవాలని అనుకున్నాం. తీరానికి సమీపిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆటుపోట్లు ఎక్కువయ్యాయి. దీంతో ఇద్దరం పడిపోయాం. నా మోకాలికి తీవ్ర గాయమైంది. అయినా వెనుదిరగకూడదని నిర్ణయించుకున్నాం. లెఫ్టినెంట్‌ కల్నల్‌ ప్రదీప్‌ సహకారం తీసుకొని శ్రీనివాస్‌ ముందడుగు వేశారు. నేను మళ్లీ పోర్టుబ్లెయిర్‌లో ప్రయాణంలో చేరి విజయవంతంగా ముందుకు వచ్చాం.

–రిటైర్డ్‌ కెప్టెన్‌ ప్రసాద్‌, సాహసయాత్రికుడు

కుటుంబప్రయాణంలా సాగింది

జకార్తా నుంచి పోర్ట్‌ బ్లెయిర్‌ వరకు మాతో పాటు నా కుమారుడు అజితేష్‌ కూడా చేరాడు. అజితేష్‌ రాకతో ఇది ఓ కుటుంబ ప్రయాణంలా అనిపించింది. ప్రతి పోర్టులోనూ ఆయా దేశాల ప్రతినిధులు అద్భుతంగా స్వాగతం పలికారు. ఈ ప్రయాణం రక్షణ రంగంతో మాకున్న అనుబంధాన్ని మరింత ఇనుమడింపజేసింది. విశాఖలోనూ మా బ్యాచ్‌మేట్స్‌తో విజయయాత్ర ముగింపు ఉత్సవాలను ఏర్పాటు చేయడం ఆనందకరంగా ఉంది.

–రిటైర్డ్‌ కల్నల్‌ శ్రీనివాస్‌, సాహసయాత్రికుడు

టైస్టీ.. ఇకపై విశాఖ!

విశాఖ వచ్చిన టైస్టీ.. త్వరలో భారత్‌కు చెందిన సెయిల్‌గా మారనుంది. భారతీయ రిజిస్ట్రేషన్‌ చేసి.. టైస్టీ సెయిల్‌కు ఐఎన్‌ఎస్‌వీ విశాఖగా నామకరణం చేయనున్నట్లు ఇండియన్‌ నేవీ ప్రకటించింది.

సాహసయాత్రలో రిటైర్డ్‌ సైనికాధికారులుకల్నల్‌ శ్రీనివాస్‌, కెప్టెన్‌ ప్రసాద్‌

న్యూజిలాండ్‌ నుంచి వైజాగ్‌కు మే 13న మొదలైన ప్రయాణం

పోలాండ్‌కు చెందిన టైస్టీ అనే పడవలో సాహసయాత్ర

యాత్ర పూర్తిచేసుకొని వచ్చిన ఇరువురికి విశాఖలో ఘన స్వాగతం

నేవల్‌ బేస్‌లో ఘన స్వాగతం

విశాఖ చేరుకున్న ఈ సాహస యాత్రికులకు నేవల్‌ బేస్‌లో ఘన స్వాగతం లభించింది. వైస్‌ అడ్మిరల్‌ కుడ్రవల్లి శ్రీనివాస్‌ అధ్యక్షతన విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, నౌకాదళ సిబ్బంది, కుటుంబ సభ్యులు హాజరై కెప్టెన్‌ ప్రసాద్‌, కల్నల్‌ శ్రీనివాస్‌లకు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement