సమన్వయంతో ఐఎఫ్‌ఆర్‌కు ఏర్పాట్లు
మహారాణిపేట: వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 20వ తేదీ మధ్యలో జరగనున్న ఐఎఫ్‌ఆర్ (ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ)–2026ను విజయవంతంగా నిర్వహించేందుకు కలిసి పనిచేద్దామని జిల్లా అధికారులు, నేవీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జేసీ కె.మయూర్ అశోక్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, డీసీపీ మణికంఠ చందోలు, నేవీ ఉన్నతాధికారులు కమొడర్లు అమీ మాథ్యూ, రజ్నీష్ శర్మ, కెప్టెన్ ఎండీ అనూప్రజ్, కమాండర్లు వైకె కిశోర్, ప్రవీణ్ కుమార్, మనోజ్ కుమార్, కె.ఎన్.మొహంతే, లెఫ్టినెంట్ కమాండర్ వీరేందర్ కుమార్ తదితర అధికారులు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కమొడర అమీ మాథ్యూ ఫ్లీట్ రివ్యూ–2026, మిలాన్ నిర్వహణ, అతిథుల రాక తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. సుమారు 100 మిత్ర దేశాల నుంచి అతిథులు విచ్చేస్తారని వారందరికీ రవాణా, వసతి సదుపాయం కల్పించాల్సి ఉందన్నారు. ఫిబ్రవరి 15 నుంచి 20వ తేదీ వరకు మిలాన్ విలేజ్ కార్యక్రమం కొనసాగుతుందని, 18న రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, 19న సిటీ పరేడ్‌తో పాటు, మిలాన్ ప్రారంభోత్సవం ఉంటుందని చెప్పారు. 19, 20వ తేదీల్లో మిలాన్ హార్బర్ ఫేజ్ ఉండగా, 21 నుంచి 25వ తేదీల వరకు సీ ఫేజ్ ఉంటుందని స్పష్టం చేశారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం కార్యక్రమ నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలన్నారు. ఎన్‌హెచ్‌ఏఐ, గెయిల్, హెచ్‌పీసీఎల్ తదితర సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. రోడ్లు, డ్రెయిన్లు, కాలువల ఆధునికీకరణ, ప్రస్తుతం పోర్టు రోడ్డులో మారుతీ జంక్షన్ వద్ద చేపడుతున్న వంతెన, కల్వర్టుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆయిల్, గ్యాస్ పైప్ లైన్ల మార్పులు, కేబుళ్ల మార్పు, ఇతర ప్రక్రియలను ప్రణాళికాయుతంగా చేపట్టాలని చెప్పారు. నేవీ, పోలీసు, ఎన్‌హెచ్‌ఏఐ, గెయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ప్రతినిధులతో పాటు, ఇన్‌చార్జి ఆర్డీవో సుధాసాగర్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.


