సొంత సామాజిక వర్గానికి పల్లా, వంశీ ద్రోహం?
శిలాఫలకం వేసిన చోటే భవనం కట్టాలని యాదవ సంఘాల డిమాండ్
డాబాగార్డెన్స్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాదవ సామాజిక వర్గంపై వివక్ష కొనసాగుతోందనే విమర్శలు ఉన్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎండాడలో కేటాయించిన యాదవ సంక్షేమ భవన స్థలాన్ని మార్చేందుకు రంగం సిద్ధం చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. కేవలం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందోనన్న అక్కసుతో.. యాదవ సామాజిక వర్గానికి చెందిన కూటమి నేతలే ఈ మార్పును ప్రోత్సహిస్తుండటం గమనార్హం.
జగన్‌కు పేరు వస్తుందనే అక్కసుతో..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఎండాడ( మహిళ పోలీస్ స్టేషన్ పక్కన)లో యాదవ భవన నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 50 సెంట్ల భూమిని కేటాయించారు. ఇచ్ఛాపురం నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు ఉన్న యాదవులకు ఇది ఎంతో అనుకూలమైన ప్రదేశం. అయితే ఈ భవనం అక్కడ పూర్తయితే జగన్‌కు శాశ్వతమైన పేరు వచ్చేస్తుందన్న అక్కసుతో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అడ్డుపుల్ల వేస్తోంది.
సొంత వర్గంపైనే పల్లా, వంశీ ప్రతాపం?
యాదవ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌లు తమ వర్గ ప్రయోజనాల కంటే రాజకీయ కక్ష సాధింపుకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతో విలువైన ఎండాడ స్థలాన్ని కాదని.. ముడసర్లోవలో స్థలం కేటాయించేలా జీవీఎంసీ కౌన్సిల్‌లో ప్రతిపాదన(అజెండా 78వ అంశం) తేవడం వెనుక వీరి హస్తం ఉన్నట్లు సమాచారం. తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాల్సిన నేతలే.. ఇలా బాబు మెప్పు కోసం సొంత జాతికి ద్రోహం చేయడంపై యాదవ సంఘాలు మండిపడుతున్నాయి.
నాడు ఘనంగా భూమి పూజ
2024 ఫిబ్రవరి 25న అప్పటి పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, అప్పటి మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, పలువురు యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతల సమక్షంలో ఎండాడలో ఈ భవనానికి ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఆ సమయంలో సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు చేసి పనులు ప్రారంభించారు. అయితే శంకుస్థాపన చేసిన స్థలాన్ని వెనక్కి తీసుకునేందుకు పూనుకోవడం చంద్రబాబు ప్రభుత్వ కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని యాదవ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థలం మార్పు చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.
యాదవులకు జగన్ పెద్దపీట
యాదవ సామాజిక వర్గ సంక్షేమం కోసం మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో చిత్తశుద్ధితో పనిచేశారు. ఎండాడలో అత్యంత విలువైన 50 సెంట్ల స్థలాన్ని కేటాయించి, భూమి పూజ కూడా చేయించారు. అందరికీ అందుబాటులో ఉండే ఆ స్థలాన్ని కాదని, ఇప్పుడు ముడసర్లోవకు మార్చేందుకు ప్రతిపాదించడంలో చంద్రబాబు ప్రభుత్వ ఆంతర్యమేంటి? కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకుని ఎవరికి కట్టబెట్టాలని చూస్తున్నారు? కేవలం రాజకీయ అక్కసుతోనే స్థలాన్ని మారుస్తున్నారా? ఎటువంటి ముందస్తు అనుమతులు ఇవ్వనని మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రకటించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని స్థల మార్పుకు అనుమతిస్తున్నారు?
– గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మేయర్
స్థలం మారిస్తే ఉద్యమం తప్పదు
యాదవులందరికీ ఎంతో సౌకర్యవంతంగా ఉండే ఎండాడ స్థలాన్ని గత ప్రభుత్వంలోనే కేటాయించి శంకుస్థాపన చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భవనాన్ని పూర్తి చేయాల్సింది పోయి, ఉన్న స్థలాన్ని లాక్కోవాలనుకోవడం దారుణం. సొంత సామాజిక వర్గ ఎమ్మెల్యేలైన పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ తక్షణం స్పందించి ఎండాడలోనే భవనం నిర్మించేలా చూడాలి. లేదంటే యాదవ సంఘాలన్నింటినీ ఏకం చేసి రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతాం.
–అల్సి అప్పలనారాయణ, అధ్యక్షుడు, జాతీయ యాదవ ఐక్యవేదిక
యాదవ భవన్‌పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు
నేడు కౌన్సిల్ సమావేశం
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరగనుంది. ఉదయం 11 గంటలకు మేయర్ అధ్యక్షతన నిర్వహించనున్న కౌన్సిల్ సమావేశంలో 90 అంశాలు చర్చకు రానున్నాయి. మరికొన్ని టేబుల్ అజెండా అంశాలు వచ్చే అవకాశం ఉంది. వీటిలో పలు అభివృద్ధి పనులతో పాటు, స్మార్ట్‌సిటీ వెండింగ్ మార్కెట్లు, పర్యాటక రంగానికి సంబంధించి భూముల కేటాయింపు, అలాగే ఎండాడ గ్రామం సర్వే నంబరు 13/6, 13/7, 14/5, 14/6లో ఉన్న 14.79 ఎకరాల భూమిని ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రి నిర్మాణానికి కేటాయించే ప్రతిపాదన, పలు సర్వీస్ అంశాలు, వేపగుంట కూడలి నుంచి పినగాడి వరకు 3.30 కిలోమీటర్ల రహదారి నిర్మాణం తదితర అంశాలు కౌన్సిల్‌లో చర్చించనున్నారు.
ఎండాడ నుంచి ముడసర్లోవకు..
ఎండాడ నుంచి ముడసర్లోవకు..


