నేటి నుంచి మార్గశిర మాసోత్సవాలు
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్ర కల్పవల్లిగా భక్తులచే పూజలందుకుంటున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభం కానున్నాయి. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభిస్తారు. మాసోత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, ఆలయ ఈవో కె.శోభారాణి ఇప్పటికే పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలూ చేపట్టాలని కలెక్టర్ వివిధ శాఖల అధికారులు, పోలీస్ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భద్రత, తాగునీరు, క్యూల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. మాసోత్సవాల్లో భాగంగా వివిధ ప్రత్యేక కార్యక్రమాలను ఆలయ అధికారులు ప్రకటించారు. డిసెంబరు 7న వేదసభ, 13న రథయాత్ర, 16న నాదస్వర కచేరీ, 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి జగన్నాథస్వామి ఆలయం వద్ద వేలాది మంది భక్తులకు మహా అన్నదానం, సాయంత్రం 4 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం జరగనుంది.
తొలి గురువారంపూజలకు ఏర్పాట్లు
మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టమైన తొలి గురువారం పూజలు ఈ నెల 27న ప్రారంభమవుతాయి. 26 అర్ధరాత్రి(తెల్లవారితే గురువారం) 12.01 గంటల నుంచే విశేష పూజలతో మొదలవుతాయి. 12.01 నుంచి 2.30 గంటల వరకు నిర్వహించే సహస్రనామార్చన, స్వర్ణకవచ అలంకరణ సేవలో పాల్గొనదల్చిన భక్తులు రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. గురువారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు నిర్వహించే పంచామృతాభిషేకం, అష్టోత్తరం, స్వర్ణకవచ పూజల్లో పాల్గొనేందుకు కూడా రూ.10 వేలు పూజా రుసుం నిర్ణయించారు. పంచామృతాభిషేకం(గురువారం మినహా) రూ.3,000, క్షీరాభిషేక సేవ (ప్రతి శుక్రవారం) రూ.1,116, శ్రీచక్ర నవావరణార్చన, మహాలక్ష్మీ హోమం (ప్రతి రోజూ) రూ.2,516గా నిర్ణయించామని ఆలయ ఈవో తెలిపారు. ఈ ఉత్సవాలు ఈ నెల 21 నుంచి డిసెంబర్ 19 వరకు కొనసాగుతాయని వివరించారు.


