
స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రత
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా
మహారాణిపేట: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులకు సూచించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, పోలీసు కమిషనర్ డాక్టర్ రవిశంకర్‌తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. విశాఖ పార్లమెంటుతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమలను తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను గమనించారు. తలుపులకు వేసిన తాళాలను, వాటికున్న సీళ్లను పరిశీలించారు. అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తనిఖీ అనంతరం లాగ్ బుక్‌లో మీనా సంతకం చేశారు. మూడెంచల భద్రతను పాటించాలని, ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌కు సూచించారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడని ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం జాగ్రత్తలు వహించాలన్నారు. పర్యటనలో భాగంగా అక్కడి పరిస్థితులను, జిల్లా యంత్రాంగం తరఫున చేపట్టిన చర్యలను సీఈవోకు కలెక్టర్, పోలీసు కమిషనర్ వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ఆయా నియోజకవర్గాల ఆర్వోలు డి.హూస్సెన్ సాహెబ్, సీతారామ్ముర్తి, శేష శైలజ, అఖిల పాల్గొన్నారు.