
ఫిర్యాదుదారుడి ఇంటికి వెళ్లి విచారిస్తున్న నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్
దొండపర్తి: తమ పిల్లలే తమను వేధిస్తున్నారని తండ్రులు చేసిన ఫిర్యాదులపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ చలించిపోయారు. స్వయంగా ఫిర్యాదుదారుల ఇళ్లకు వెళ్లి విచారించారు. వాస్తవాలకు తెలుసుకుని తల్లిదండ్రులను వేధింపులకు గురి చేసినా, దాడులు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివరాలివీ.. సోమవారం నిర్వహించిన స్పందనలో ఆర్.ఆర్.వెంకటాపురం, ఆరిలోవ, రామజోగిపేట, కంచరపాలెం ప్రాంతాలకు చెందిన వృద్ధులు తమ కొడుకులు, కుటుంబ సభ్యులు ఆస్తులు తీసుకుని తమను వేధింపులకు గురి చేస్తున్నారని సీపీకి ఫిర్యాదులు చేశారు. వీరిలో రామజోగిపేటకు చెందిన 78 ఏళ్ల వృద్ధుడికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెయింటర్‌గా పనిచేస్తూ సంపాదించిన డబ్బుతో తన పిల్లలను చదివించి, పెళ్లిళ్లు చేశాడు. ఓ ఇల్లు కట్టుకుని తన పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. అతని భార్య చనిపోయినప్పటి నుంచి కొడుకులు, కోడళ్లు అతన్ని హింసించి, వేధింపులకు గురి చేస్తున్నారు. ఐదుసార్లు చంపడానికి ప్రయత్నించారని, ఈ నెల 20న దాడి చేశారని ఆయన తెలిపారు. దీనిపై అతని కుమార్తెలు వచ్చి అడగ్గా.. వృద్ధుడి రెండో కుమారుడు వారిపై అనుచితంగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై పెద్దాయన సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీపీ సోమవారం రాత్రి ఫిర్యాదుదారిని ఇంటికి వెళ్లి విచారించారు. వాస్తవాలు తెలుసుకుని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్‌ల నిర్వహణ సంక్షేమ చట్టం, 2007 యూ/ఎస్ 24 ప్రకారం వృద్ధులతో అనుచితంగా ప్రవర్తించినా.. మానసికంగా, ఆర్థికంగా లేదా శారీరకంగా ఇబ్బందులకు గురి చేసినా మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.5 వేలు వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారని హెచ్చరించారు.
ఫిర్యాదుదారుల ఇంటికి వెళ్లి పరిస్థితిని గమనించిన రవిశంకర్
తల్లిదండ్రులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక