చేనుపైనే బయానా! | - | Sakshi
Sakshi News home page

చేనుపైనే బయానా!

Nov 13 2026 8:33 AM | Updated on Nov 13 2026 8:33 AM

పెరుగుతున్న సాగు

వికారాబాద్‌: సన్న రకం ధాన్యానికి ఓపెన్‌ మార్కెట్లో మంచి డిమాండ్‌ కనిపిస్తోంది. రైతుల నుంచి వీటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఎగబడుతున్నారు. ఏకంగా పొలాల వద్దకే వెళ్లి బేరం పెడుతున్నారు. నూర్పిళ్లు పూర్తి కాకముందే బయానాగా కొంత నగదు ముట్టజెప్పి, తమకే విక్రయించాలని అంగీకారం కుదుర్చుకుంటున్నారు. గతంతో పోలిస్తే జిల్లాలో ఈసారి సన్నరకం వరి సాగు గణనీయంగా పెరిగింది. పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుండటంతో వీటికి ప్రాధాన్యం సంతరించుకుంది. రైతులు పండించిన సన్న రకం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిస్తే తమ వ్యాపారం దెబ్బతింటుందని భావిస్తున్న మిల్లర్లు, దళారులు పొలం బాట పట్టారు.

● జిల్లాలో సాగవుతున్న వరిలో ఇరవై శాతం వరకు రైతులు సన్న రకం వరి వేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వడ్లను బయటి మార్కెట్లోనే విక్రయిస్తున్నారు. లేదా బియ్యం పట్టించి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్నారు. ఈక్రమంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఐదుశాతం ఉత్పత్తులు కూడా వెళ్లడం లేదు. రేషన్‌ బియ్యం సరఫరా కోసం ప్రభుత్వం పక్క జిల్లాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈక్రమంలో జిల్లా రైతులు పండించిన సన్న రకం ధాన్యాన్ని సేకరించడం సర్కారుకు తప్పనిసరిగా మారింది. అయితే సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున ప్రోత్సాహకం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేస్తోంది. గతేడాదికి సంబంధించిన డబ్బులు ఇప్పటికీ చెల్లించకపోవడంపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు.

మొత్తం సేకరిస్తే..

జిల్లాలో మొత్తం 2.5 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటిద్వారా లబ్ధిదారులకు ప్రతినెల 6,373 మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమవుతాయి. ఈ లెక్కన ఏడాదికి 74,476 మెట్రిక్‌ టన్నుల బియ్యం కావాలని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి జిల్లాలో 22 వేల ఎకరాల్లో సన్న రకం వరి సాగైంది. యాసంగిలో మరో 15 వేల ఎకరాల్లో సన్నరకం వరి సాగుకానుంది. ఈ మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే సేకరిస్తే.. దిగుమతి చేసుకునే అవస్థలు కొంతవరకు తగ్గుతాయి.

సన్నరకం ధాన్యానికి మంచి డిమాండ్‌

నూర్పిళ్లకు ముందే బేరం కుదుర్చుకుంటున్న వ్యాపారులు

ప్రభుత్వ బోనస్‌ అందక.. ప్రైవేటుకే మొగ్గు చూపుతున్న రైతులు

జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 93 వేల ఎకరాలు కాగా, ఈ ఏడాది 1.04 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో అత్యధికంగా పరిగి వ్యవసాయ డివిజన్‌లో నమోదైంది. ఆతర్వాతి స్థానాల్లో తాండూరు, కొడంగల్‌ డివిజన్లున్నాయి. జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉండగా ఇందులో 12 మండలాల్లో వెయ్యి నుంచి ఐదు వేల ఎకరాల్లో వరి సాగు నమోదైంది. గతేడాదితో పోలిస్తే సన్నరకం వడ్ల సాగు విస్తీర్ణం ఈ ఏడాది పెరిగింది. గతేడాది జిల్లాలో 14 వేల ఎకరాల్లో సాగవగా ఈసారి 22 వేల ఎకరాలకు చేరింది. ఇప్పటికీ స్థానిక వ్యాపారులు కర్నూలు నుంచి సన్న బియ్యం దిగుమతి చేసుకుంటున్నారు. రేషన్‌ దుకాణాల్లో సన్నబియ్యం కోసం ప్రభుత్వం పక్క జిల్లాలైన సంగారెడ్డి, నిజామాబాద్‌, నారాయణ్‌పేట్‌, నాగర్‌కర్నూల్‌పై ఆధారపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement