వికారాబాద్: అనధికార విద్యుత్ కోతలు అన్ని వర్గాలను కలవర పెడుతోంది. అధికారికంగా కొంత సేపు, అనధికారికంగా గంటల తరబడి పవర్ కట్ చేస్తున్నారు. కరెంటు లేక పంటలు ఎండుతుండటంతో పలు గ్రామాల్లో రైతులు సబ్‌స్టేషన్లను ముట్టడిస్తున్నారు. ఇటీవల కాలంలో అన్నదాతల ఆందోళనలు ఎక్కువయ్యాయి. వ్యవసాయ రంగానికి 13గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా వాస్తవానికి 11గంటలే ఇస్తున్నారు. అందులోనూ గంటల తరబడి కోతలు విధిస్తున్నారు. ఎల్సీ, లోడ్ రిలీఫ్ తదితర కారణాలతో కోతలు విధిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎక్కువ మంది రైతులు బోరుబావులపైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారు. ఇటీవల కొంతమంది రైతులు విద్యుత్ కోతల విషయాన్ని స్పీకర్ ప్రసాద్‌కుమార్ దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన నేరుగా ట్రాన్స్‌కో సీఎండీకి ఫోన్ చేసి సమస్యను వివరించారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. విద్యుత్ కోతలు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దిగుబడి తగ్గుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా సాయంత్రం పంటలకు నీళ్లు పారిస్తారు.. ఆ సమయంలోనే ఎక్కువగా కోతలు విధిస్తున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు పలు దఫాలు పవర్ కట్ చేస్తుండటంతో ఎప్పుడు నీరు పెట్టుకోవాలో తెలియక అన్నదాత ఆందోళన చెందుతున్నాడు.
ముందస్తు సమాచారం లేకుండా..
గృహ అవసరాలకు 24 గంటల సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా గంటల తరబడి కరెంటు ఉండటం లేదు. పరిగి, వికారాబాద్ ప్రాంతాల్లో ముందస్తు సమాచారం లేకుండా పవర్ కట్ చేస్తూ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నవాబుపేట మండలం అఖ్నాపూర్‌లో మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు ఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా ఆపేశారు. సెలవు దినాలు శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోత విధిస్తున్నారు. ఎవరైనా ఫోన్ చేస్తే పనులు జరుగుతున్నాయని, కొత్త లైన్లు వేస్తున్నామని, లోడ్ రిలీఫ్ అంటూ సమాధానం చెబుతున్నారు. వ్యవసాయానికి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పవర్ కట్ చేస్తున్నారు. గృహ అవసరాలకు రెండు నుంచి నాలుగు గంటల కోత విధిస్తున్నారు.
వ్యవసాయానికి రోజుకు 11 గంటలే..
అందులోనూ గంటల తరబడి నిలిపివేత..
గణనీయంగా పెరిగిన కరెంటు వాడకం
గతేడాది ఇదే సీజన్‌లో సగటు వినియోగం 244 మెగావాట్లు
ప్రస్తుతం 290 మెగావాట్లు
జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లు 78,712
గృహ కనెక్షన్లు 2,53,110
లోఓల్టేజీతో ఇబ్బందులు
ట్రాన్స్ ఫార్మర్ల స్థాయికి మించి కనెక్షన్లు ఇస్తుండటంతో నాణ్యమైన విద్యుత్ సరఫరా కావడం లేదు. లో ఓల్టేజీ కారణంగా మోటార్లు కాలిపోతున్నాయి. ట్రాన్స్‌ఫా ర్మర్లు దెబ్బతింటున్నాయి. ఇటీవల కొడంగల్ సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ ఆధారంగా పని చేసే షాపు లు నడవని పరిస్థితి నెలకొంది. దీంతో వ్యాపారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లు 78,712, గృహ వినియోగ కనెక్షన్లు 2,53,110, కమర్శియల్ కనెక్షన్లు 34,316 ఉన్నాయి. ఎండ తీవ్రత కారణంగా విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. జిల్లాలో గతేడాది ఇదే సీజన్‌లో 244 మెగావాట్ల విద్యుత్ వినియోగించగా ప్రస్తుతం 290 మెగావాట్ల వినియోగిస్తున్నారు.


