మరో రెండు రోజులే.. | - | Sakshi
Sakshi News home page

మరో రెండు రోజులే..

Nov 4 2026 8:04 AM | Updated on Nov 4 2026 8:04 AM

వికారాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పట్టభద్రుల ఓటరు నమోదుకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 6వ తేదీతో గడువు ముగియనుంది. హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల పరిధిలోని వికారాబాద్‌ జిల్లాలో ఓటర్ల నమోదు మందకొడిగా సాగుతోంది. జిల్లాలో దాదాపు 50వేల నుంచి 60వేల మంది వరకు పట్టభద్రులు ఉండగా ఇప్పటి వరకు కేవలం 27వేల మందే ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. వేలాది మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

ఓటరు నమోదు ఇలా..

● శాసన మండలి సభ్యుని కాల వ్యవధి ఆరు సంవత్సరాలు. ప్రతి రెండేళ్లకోసారి పెద్దల సభలో మూడింట ఒకవంతు సభ్యులు పదవీ విరమణ అయి కొత్తవారు ఎన్నికవుతారు. ఈ తరుణంలో ఎన్నికలు జరుగుతాయి.

● త్వరలో తెలంగాణ శాసన మండలిలో ఇద్దరు సభ్యులు వాణి సురభిదేవి, తీన్మార్‌ మల్లన్న పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. త్వరలో హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంతోపాటు వరంగల్‌, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

● ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి అందరికీ ఓటుహక్కు ఉండదు. 01–11–2026 తేదీ నాటికి కనీసం మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ముందు పట్టభద్రులుగా లేదా తత్సమానా పరీక్ష ఉత్తీర్ణులైన వారికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారు అర్హులు.

● 1–11–2023 కంటే ముందు డిగ్రీ ఉత్తీర్ణులైన వారు సంబంధిత యూనివర్సిటీ లేదా విద్యా సంస్థ జారీ చేసిన పట్టా లేదా మార్క్స్‌ మెమో, ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌ కలిగిన వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.

● గతంలో ఓటరుగా నమోదు చేసుకున్నా అది చెల్లదు. ఇప్పుడు కచ్చితంగా నమోదు చేసుకోవాలి. ప్రజాప్రతినిథ్య చట్టం 1950 ప్రకారం శాసన మండలి ఎన్నికలు జరిగే ప్రతిసారీ అర్హులైన వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాల్సిందే.

● ఓటరు నమోదు కోసం తెల్లకాగితం ఇతర పేపర్ల మీద చేసుకునే దరఖాస్తు చెల్లదు. ఫారం –18 ద్వారానే ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

● దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ ఫారాన్ని తహసీల్దార్లు, ఆర్డీఓలకు అందజేయాల్సి ఉంటుంది. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు అధికారులకు చూపి ఫారంపై సంతకం తీసుకోవాలి.

● ఒకవేళ ఉద్యోగం చేస్తూ సర్టిఫికెట్లు అందుబాటులో లేకపోతే పని చేసే కార్యాలయం, సంస్థకు చెందిన గెజిటెడ్‌ అధికారితో సర్టిఫికెట్లు తమ వద్ద ఉన్నట్లు ధ్రువీకరించే సంతకం చేసిన కాపీని ఫారం –18కు జత పరచాలి.

● గతంలో సర్టిఫికెట్లు ఇచ్చిన వారు కూడా ఇప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఆ పారాన్ని తిరస్కరిస్తారు.

● నవంబర్‌ 25న ముసాయిదా ఓటరు జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. అందులో పేర్లు లేకపోయినా.. అభ్యంతరాలు ఉన్నా నవంబర్‌ 25నుంచి డిసెంబర్‌ 10వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్‌ 30న ఓటరు తుది జాబితాను ప్రకటిస్తారు.

● డిగ్రీ పాసైన తేదీగా సంబంధిత సంస్థ అందజేసిన మెమో గానీ ప్రొవిజినల్స్‌ గానీ నమోదు చేసిన తేదీని డిగ్రీ పాసైన తేదీగా పరిగణలోకి తీసుకుంటారు.

● ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే జిల్లాల వారు కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల వారు ఇప్పడు ఓటరుగా నమోదు చేసుకోవటానికి అర్హులు కాదు.

● ఏఈఆర్‌ఓలు, ఈఆర్‌ఓలు వ్యవహరిస్తున్న కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పట్టభద్రుల ఓటరు జాబితాను రూపొందిస్తారు. ఈ జాబితా తెలుగు ఇంగ్లిష్‌ భాషల్లో ముద్రిస్తారు.

పట్టభద్రుల ఓటరు నమోదుకు శుక్రవారంతో ముగియనున్న గడువు

ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నది 27వేల మందే

సగం కూడా కాని వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement