తాండూరు టౌన్: తాండూరు బస్ డిపో పరిధిలో నేడు(బుధవారం) దివ్యాంగులకు బస్‌పాస్ మేళా కార్యక్రమం నిర్వహించనున్నట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిములు, జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ మంగళవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. పెద్దేముల్, యాలాల, తాండూరు, బషీరాబాద్ మండలాలకు చెందిన దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సదరం సర్టిఫికెట్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్‌ఫొటో, బస్‌పాస్ కోసం రుసుం రూ.50 తీసుకుని ఉదయం 11 గంటలకు తాండూరు ఆర్టీసీ బస్టాండుకు రావాలన్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు డిపో మేనేజర్ పరిటాల ప్రవీణ్ కుమార్ హాజరవుతారన్నారు. వివరాలకు 9182190549 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు.
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో బుధవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక సమావేశానికి ముఖ్యఅతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హాజరుకానున్నారు. సాయంత్రం 5గంటలకు పట్టణంలోని శివకేశవ బ్యాంకెట్ హాల్‌లో సమావేశం నిర్వహించనున్నారు. సమాజంలో పెరుగుతున్న అరాచకాలను అరికట్టడానికి, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్చలపై చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యావంతులు, మేధావులు, న్యాయవాదులు, వైద్యులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నట్లు పార్టీ కోఆర్డినేటర్ వడ్లనందు తెలిపారు.
బొంరాస్‌పేట: దుద్యాల మండలం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌లో రైతు మేళా ఏర్పాట్లను మంగళవారం టీజీఐఐసీ ఈడీ పవన్‌కుమార్ పరిశీలించారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో మెగా రైతు మేళా నిర్వహించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పామాయిల్ పరిశ్రమ ఏర్పాటు పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు పర్యటించారు. కార్యక్రమంలో ఇండస్ట్రియల్ సీజీఎం రాథోడ్, జోనల్ మేనేజర్ రఫీక్, డిప్యూటీ జనరల్ మేనేజర్ శేషగిరిరావు, ప్రాజెకు ఇంజనీర్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ తహసీల్దార్ సురేష్
మోమిన్‌పేట: భూ భారతి చట్టం రీ సర్వేతో ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని డిప్యూటీ తహసీల్దార్ సురేష్ తెలిపారు. మంగళవారం మండలంలోని గోవిందాపూర్‌లో రైతులతో సర్వేపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు రీ సర్వేతో పరిష్కారం దొరుకుతుందన్నారు. రైతులు దగ్గరుండి సర్వేకి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌ఐ గోవర్ధన్, కార్యదర్శి జగన్‌రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.


