టెండర్ ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం రూ.3,295 కోట్ల వ్యయంతో నిర్మాణం ఇప్పటికే భూసేకరణ పూర్తి 246 అడుగుల వెడల్పుతో81 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఓఆర్‌ఆర్ బుద్వేల్ ఎగ్జిట్ నంబర్ 17నుంచి కొడంగల్ వరకు.. వ్యవధి 18 నెలలు.. మూడు ప్యాకేజీలుగా పనులు త్వరలో సీఎం చేతులమీదుగా భూమిపూజకు ఏర్పాట్లు
వికారాబాద్: రేడియల్ రోడ్డు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే టెండర్ ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం త్వరలో పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. నవంబర్ మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా భూమిపూజ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ సమీపంలోని బుద్వేల్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 17 నుంచి శంషాబాద్, షాబాద్, పరిగి, పూడూరు, దోమ మండలాల మీదుగా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని హకీంపేట్ వరకు రేడియల్ రోడ్డు నిర్మించనున్నారు. ఈ రోడ్డు రాజేంద్రనగర్, చేవెళ్ల, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలను కలపనుంది. ఔటర్ రింగు రోడ్డు నుంచి ప్రారంభమై నేషనల్ హైవే 167తో అనుసంధానం చేస్తుంది. నాలుగు నెలల క్రితమే సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించగా దీనికి సంబంధించిన ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. 81 కిలోమీటర్ల దూరం ఆరు వరుసలుగా నిర్మించనున్నారు. ఇందు కోసం రూ.3,295 కోట్లు ఖర్చు చేయనున్నారు. రింగ్‌రోడ్డును కలుపుతూ రెండవ రేడియల్ రోడ్డుగా అభివృద్ధి చేస్తారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూ సేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు. 246 అడుగుల వెడ ల్పుతో 81 కిలోమీటర్ల దూరం వరకు నాలుగు వరుసలుగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించనున్నారు. భవిష్యత్తులో మెట్రోను సైతం అనుసంధానించేలా భూసేకరణ, డిజైన్ చేశారు.
18 గ్రామాల మీదుగా..
జిల్లాలోని ఆరు మండలాల పరిధిలోని 18 గ్రామాల మీదుగా రేడియల్ రోడ్డు వెళ్లనుంది. దోమ మండలంలో తొమ్మిది గ్రామాల మీదుగా వెళ్తుంది. ఆ గ్రామాల్లో భూ సేకరణ పూర్తి చేశారు. కుల్కచర్ల, పూడూరు మండలాల్లో ఒక్కో గ్రామం మీదుగా.. పరిగి మండలంలో ఐదు గ్రామాల మీదుగా, దుద్యాల మండలంలో రెండు గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్లనుంది. పరిగి నియోజకవర్గంలో 400 పైచిలుకు ఎకరాలు, దుద్యాల మండలంలో 99 ఎకరాలు కలిపి మొత్తం 500 ఎకరాలు సేకరించారు. భూమి విలువకు కొంచం అటూ ఇటూగా నాలుగు రెట్ల అధికంగా పరిహారం ఇచ్చారు. కొంతమంది రైతులు మినహా అందరూ స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే భూముల విలువ పెరగనుంది. రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది. పరిగి మండలం సయ్యద్‌పల్లి, రాపోల్ తదితర గ్రామాల్లో ఎకరా భూమి విలువ రూ.8.40లక్షలు ఉండగా ప్రభుత్వం రూ.32 లక్షల నుంచి రూ.34 లక్షల వరకు పరిహారం రూపంలో చెల్లించింది. దోమ, దుద్యాల మండలాల్లో ఎకరానికి రూ.24 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు. రేడియల్ నిర్మాణ బాధ్యతలు హెచ్‌ఎండీఏ చేపడుతోంది. 18 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేయాల్సి ఉంది. మూడు ప్యాకేజీలుగా విభజించి నిర్మించనున్నారు. మొదటి ప్యాకేజీ బుద్వేల్ నుంచి షాబాద్ వరకు, రెండో ప్యాకేజీ షాబాద్ నుంచి దోమ మండలం గూడూరు వరకు మూడో ప్యాకేజీ గూడూరు నుంచి కొడంగల్ సమీపంలోని జాతీయ రహదారి 167 నాచారం వరకు నిర్మించనున్నారు.
ఓఆర్‌ఆర్‌ను కలుపుతూ రెండో రోడ్డుగా అభివృద్ధి
పారిశ్రామిక అభివృద్ధికి ఊతం
ఈ అధునాతన సువిశాల రోడ్డు (రేడియల్ రోడ్డు) నిర్మాణం పూర్తయితే రంగారెడ్డి జిల్లా పశ్చిమ ప్రాంతంతో పాటు వికారాబాద్ జిల్లా అభివృద్ధి వేగం పుంజుకునేందుకు అవకాశం ఉంది. ఓఆర్‌ఆర్ నుంచి నిర్మించబోయే ట్రిపుల్‌ఆర్‌ను అనుసంధానించనున్నారు. పరిగి మండలం రాపోల్, కాండ్లాపూర్ గ్రామాల్లో నిర్మించతలపెట్టిన ఇండస్ట్రియల్ పార్కు, షాబాద్ మండలం సీతారాంపూర్, హైతాబాద్ సమీపంలో ఏర్పాటైన పారిశ్రామిక కారిడార్, భవిష్యత్తులో దోమ మండలంలో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక వాడ, కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కులకు రేడియల్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రేడియల్ రోడ్డు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో ఏర్పాటయ్యే ఐటీ క్లస్టర్లు, పారిశ్రామిక వాడల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడనుంది. ఇదే సమయంలో పారిశ్రామిక వాడలకు శంషాబాద్ కార్గో టెర్మినల్ ద్వారా భారీ యంత్రాలు, ముడి సరుకులను పరిశ్రమలకు తరలించటానికి సులభతరమవుతుంది. దీంతో పాటు ట్రిపుల్ ఆర్, ఓఆర్‌ఆర్‌లను అనుసంధానించడం ద్వారా అన్ని ప్రధాన జాతీయ రహదారులకు కూడా ఇక్కడి నుంచి వెళ్లడం సలువవుతుంది. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పారిశ్రామిక వాడలకు లింక్ అవుతుంది.


