కొడంగల్: పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం కొడంగల్‌కు వచ్చిన సందర్భంఆ రోడ్ల పరిస్థితిని గమనించారు. ఏడాది క్రితమే విస్తరణకు అధికారులు సమాయత్తమయ్యారు. గత ఏడాది అక్టోబర్ ఒకటిన రహదారికి ఇరువైపులా 60 అడుగులు వరకు విస్తరించడానికి మార్కింగ్ వేశారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు 10 అడుగులు తగ్గించి 50కి కుదించారు. ఎంత మంది నివాసాలు, స్థలాలు పోతున్నాయో గుర్తించివారికి నోటీసులు ఇచ్చారు. నష్ట పరిహారం విషయంలో బాధితులతో అధికారులు చర్చించారు. కొందరి నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు. అయితే పనులు ప్రారంభించడంలో జాప్యం జరిగింది. గురువారం సీఎం పర్యటన సందర్భంగా రోడ్లను చూసి వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దీంతో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, కమిషనర్ బలరాం నాయక్, తహసీల్దార్ రాంబాబు, ఆర్‌అండ్‌బీ అధికారులు శుక్రవారం ప్రధాన రహదారికి ఇరువైపులా స్థలపరిశీలన చేశారు. రోడ్డు మధ్య నుంచి అటు 25 అడుగులు, ఇటు 25 ఫీట్లు మొత్తంగా 50 అడుగులు రోడ్డు వేయనున్నట్లు అధికారులు తెలిపారు.
లాహోటీ కాలనీ నుంచి గుడి వరకు..
పట్టణంలోని లాహోటీ కాలనీ నుంచి వినాయక చౌరస్తా మీదుగా మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు ప్రధాన రహదారిని విస్తరించనున్నారు. ఈ మేరకు అధికారులు పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. స్థలాల యజమానులతో మాట్లాడారు. విస్తరణ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం అధికారులు లెక్క కట్టి ఇస్తారని అన్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు కొడంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
వినాయక చౌరస్తా విస్తరణ
పట్టణంలోని వినాయక చౌరస్తా ఇరుకుగా ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. మహబూబ్‌నగర్ – చించోలీ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా వినాయక చౌరస్తాను విస్తరించాల్సి ఉంది. వినాయక చౌరస్తా సమీపంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ వసతి గృహాలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. నిత్యం వేలాది మంది విద్యార్థులు తిరుగుతుంటారు. రోజా ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. ప్రయాణికులను ఎక్కించుకోడానికి దించడానికి ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడే ఆగుతాయి. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి కొడంగల్, తాండూరు మీదుగా కర్ణాటక రాష్ట్రం చించోలీ వరకు జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. బెంగళూరు, ముంబై జాతీయ రహదారులను కలిపే ఈ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు తిరుగుతాయి. మహబూబ్‌నగర్, కొడంగల్, తాండూరు మీదుగా చించోలి, మన్నాకెళ్లి వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో వినాయక చౌరస్తాను వెడల్పు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు.


