బంట్వారం: మైనింగ్ క్వారీ నీటి గుంతలో పడి కర్ణాటక రాష్టం కుంచారానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం మండలంలోని తెలంగాణ సరిహద్దు బొప్పునారం శివారులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన అజయ్(14), సురేందర్(15) ఈత కొట్టేందుకు సమీపంలోని మణికంట మైనింగ్ క్వారీకి వెళ్లారు. వీరితో కలిసి వెళ్లిన రాహుల్ అనే యువకుడు గట్టుపై ఉన్నాడు. అజయ్, సురేందర్ నీటి గుంతలోకి దూకారు. అజయ్‌కు ఈత రాకపోవడంతో సురేందర్‌ను గట్టిగా పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీట మునిగి ఊపిరాడక మృతి చెందారు. గట్టుపై నిల్చున్న రాహుల్ వెంటనే క్వారీ సిబ్బందికి చెప్పడంతో వారు మృతదేహాలను బయటకు తీశారు. మృతులిద్దరు కుంచారం ప్రభుత్వం పాఠశాలలో చదువుకుంటున్నారు. మైనింగ్ యాజమాన్యం క్వారీ గుంతల వద్ద ఎలాంటి భద్రత చర్యలు చేపట్ట లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే ధారూరు సీఐ రఘురాములు, ఎస్‌ఐ పుండ్లిక్ ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా జరిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘురాములు తెలిపారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


