ఎమ్మెల్యే కాలె యాదయ్య
శంకర్‌పల్లి: అభివృద్ధి పనుల్లో గుత్తేదారులు తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం మండలంలోని రావులపల్లికలాన్ గ్రామంలో నూతనంగా చేపడుతున్న బీటీరోడ్డు పనులను ఆయన పీఏసీఎస్ చైర్మన్ బొల్లారం వెంకట్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పల్లెలను అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తోందని, దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అదే విధంగా గుత్తేదారులు చేపట్టిన ప్రతి పనిని సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడూ పరిశీలించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలుంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
హైమాస్ట్ లైట్లు ప్రారంభం
మొయినాబాద్‌రూరల్: గ్రామాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ప్రతీ వీధిలో లైట్లు ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను సర్పంచ్ అర్చనఅజయ్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్‌రెడ్డి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఘన నివాళి
షాబాద్: మండల పరిధిలోని మన్‌మర్రి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు ఎర్రవల్లి శివకుమార్(రాజు) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అవినాశ్‌రెడ్డి ఆదివారం గ్రామానికి వెళ్లి శివకుమార్ మృతదేహానికి నివాళులర్పించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


