కేశంపేట: గ్రామాల రూపురేఖలను మార్చడంతో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు అందించి గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించాయి. ఒక్కో గ్రామంలో రూ.12.60లక్షలను వెచ్చించి సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ అవగాహన లేమితో అవి అశించిన స్థాయిలో వినియోగంలోకి రాలేదు.
29 గ్రామాల్లో..
గ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను అందించి అప్పటి జాతీయ ఉపాధి హామీ(బీవీరాంజీ) పథకంలో వైకుంఠధామాల నిర్మాణాన్ని పూర్తిచేశారు. గ్రామాల్లో దహన సంస్కారాలకు అనువైన ప్రదేశంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించారు. మండలంలోని 29 గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించారు. కానీ కొన్ని గ్రామాల్లో వాటిని వినియోగించేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. ఇందుకు స్థానిక ఆచారాలు, సంప్రదాయాలు, అవగాహన లోపాలే కారణం అంటూ పలువురి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి ప్రజలకు అవగాహన కల్పంచాలని కోరుతున్నారు.
సౌకర్యాలు కల్పిస్తున్నా..
వైకుంఠధామాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా గ్రామంలో ఎవరైనా మరణిస్తే వైకుంఠధామంలో దహన సంస్కారాలకు ముందుకొస్తే అధికారులే ఉచితంగా కట్టెలతో పాటు నీటి వసతిని కల్పిస్తున్నారు. వారు ఎంత ప్రయత్నించినా వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేలేకపోతున్నారు. దీంతో లక్షలతో నిర్మించిన వైకుంఠధామాలు నిరుపయోగంగా మారుతున్నాయి.
నిరుపయోగంగా వైకుంఠధామాలు
లక్షల ప్రజాధనం వృథా
అవగాహన లేమితో ముందుకు రాని ప్రజలు
పట్టించుకోని అధికారులు


