పరిగి: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశ్రమ పాఠశాలల ఇన్‌స్ట్రక్టర్లు మంగళవారం పరిగి పట్టణంలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఇంటి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలల్లో తోటి ఉపాధ్యాయులతో సమానంగా పని చేస్తున్నా కనీస వేతనం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లుగా తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న వేతనం రోజువారి ఖర్చులకు కూడా సరిపోవడం లేదన్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లాలని, అప్పటి వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆయా ఆశ్రమ పాఠశాలల ఇన్‌స్ట్రక్టర్లు పాల్గొన్నారు.


